
రాష్ట్ర విభజనతో ఇరువైపులా ప్రయోజనం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలు మరింత పెరగగలవని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ ఎండీ ఎ. కృష్ణ కుమార్ తెలిపారు. అసలు ఏ రాష్ట్ర విభజన వెనుకైనా ముఖ్యోద్దేశం.. రెండు ప్రాంతాల్లోనూ వృద్ధిని మెరుగుపర్చాలన్నదేనని పేర్కొన్నారు.
తమ వ్యాపార కార్యకలాపాలను మరింత విస్తరించడానికి ఇది మరొక అవకాశంగా తాము పరిగణిస్తున్నట్లు బుధవారమిక్కడ ఎస్‌బీఐ శాఖ ప్రారంభించిన సందర్భంగా కృష్ణకుమార్ చెప్పారు. నిర్దిష్టంగా వృద్ధి ఏ స్థాయిలో ఉంటుందన్నది లెక్కలు వేయలేనప్పటికీ.. విభజన వల్ల రెండు రాష్ట్రాల ప్రజల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉందన్నారు. ‘రాష్ట్రాల విభజన పరిస్థితులను ఎదుర్కొనడం అన్నది ఎస్‌బీఐకి కొత్త కాదు. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్ లాంటి రాష్ట్రాల విభజనను చూశాం. ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికీ మా కార్యాలయాలు ఉన్నాయి, వ్యాపారం కూడా చేస్తూనే ఉన్నాం’ అని కృష్ణ కుమార్ వివరించారు. అయితే, గత కొన్నాళ్లుగా రాష్ట్ర విభజన అంశం మీద జరుగుతున్న ఆందోళనల కారణంగా తమ వ్యాపారం దెబ్బతిందని చెప్పారు.
ఎస్‌బీఐలో తగ్గనున్న నియామకాల జోరు..
కార్యకలాపాలు విస్తరిస్తున్నప్పటికీ రాబోయే రెండు,మూడేళ్లలో తాము భారీ స్థాయిలో నియామకాలు చేపట్టకపోవచ్చని కృష్ణ కుమార్ తెలిపారు. సిబ్బంది సంఖ్యను ప్రస్తుత స్థాయిలోనే కొనసాగించే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఎస్‌బీఐలో 2.23 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని, మార్చ్ ఆఖరు నాటికి ఈ సంఖ్య 2.2 లక్షలకు తగ్గొచ్చని కృష్ణకుమార్ తెలిపారు. పదవీ విరమణ చేసే వారి స్థానాల్లో భర్తీలు చేయడం తప్ప ఉద్యోగుల సంఖ్యను పెంచుకోకపోవచ్చని చెప్పారు. మరోవైపు, దేశంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుత త్రైమాసికంలో కార్పొరేట్ రుణాలకు పెద్దగా డిమాండ్ ఉండకపోవచ్చన్నారు.
జంట నగరాల్లో 187వ, హైదరాబాద్ సర్కిల్‌లో 1379వ బ్రాంచ్‌ను కృష్ణకుమార్ సనత్‌నగర్‌లో ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పెన్షన్‌దారుల సౌకర్యార్ధం హెల్ప్‌లైన్ నెంబర్ 1800-425-4787ను ప్రారంభించినట్లు తెలిపారు. రానున్న రెండు నెలల్లో 500 కస్టమర్ సర్వీస్ పాయింట్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.