కొన్నాళ్లుగా స్థిరంగా ఉంటూ... ఒక రోజు పడినా మరునాడు పెరుగుతూ వస్తున్న స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ పతనాన్ని కళ్లజూశాయి.
⇒ ఒక్కరోజే రూ.7 లక్షల కోట్ల సంపద ఆవిరి
⇒ సెన్సెక్స్ 1,625 పాయింట్లు..
⇒ నిఫ్టీ 491 పాయింట్లు పతనం
⇒ ఆరున్నరేళ్ల కనిష్టానికి చమురు, లోహాలు
⇒ సంక్షోభ పరిస్థితుల్ని ఎగదోసిన చైనా మందగమనం
⇒ మళ్లీ గ్రీసు సంక్షోభం తలెత్తవచ్చన్న ఆందోళన
⇒ అమెరికాలోనూ కొనసాగుతున్న మార్కెట్ల పతనం
కొన్నాళ్లుగా స్థిరంగా ఉంటూ... ఒక రోజు పడినా మరునాడు పెరుగుతూ వస్తున్న స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ పతనాన్ని కళ్లజూశాయి. ఉదయం ఆరంభమవుతూనే 600 పాయింట్లు కోల్పోయిన బీఎస్‌ఈ సూచీ సెన్సెక్స్... ట్రేడింగ్ ముగిసేసరికి 1,625 పాయింట్లు కోల్పోయింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 491 పాయింట్లు పతనమైంది. దీంతో ఒక్కరోజులోనే రూ.7 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద ఆవిరయిపోవటమే కాదు... ట్రిలియన్ క్లబ్ నుంచి భారతీయ స్టాక్ మార్కెట్లు జారిపోయాయి కూడా! ఒక్కరోజులో ఇన్ని పాయింట్లు కోల్పోవటం... ఇంత మొత్తంలో సొమ్ము ఆవిరవడం చరిత్రలో ఎప్పుడూ లేదు. శాతాల వారీ చూసినా 2009 తరవాత ఈ స్థాయి పతనం లేదు. బీఎస్‌ఈ-500 కంపెనీల్లో 114 కంపెనీల షేర్లు సోమవారం ఒక్కరోజే ఏడాది కనిష్టానికి చేరిపోయాయి. బీఎస్‌ఈ మొత్తం మార్కెట్ క్యాప్‌లో ఈ 500 కంపెనీలదే 93 శాతం..!!