టాటా స్టీల్ నష్టం... రూ.3,214 కోట్లు
12 శాతం తగ్గిన ఆదాయం
* ఒక్కో షేర్‌కు రూ.8 డివిడెండ్
న్యూఢిల్లీ: టాటా స్టీల్ సంస్థ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన గత ఆర్థిక సంవత్సం నాలుగో త్రైమాసిక కాలానికి రూ.3,214 కోట్ల నికర నష్టాల్ని ప్రకటించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2014-15) ఇదే క్వార్టర్‌లో వచ్చిన నష్టాలు రూ.5,702 కోట్లతో పోలిస్తే ఈ క్యూ4లో నష్టాలు తగ్గినట్లే. అయితే గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక నష్టాలు రూ.2,127 కోట్లతో పోలిస్తే 4వ త్రైమాసికంలో నష్టాలు పెరిగాయి.
మొత్తం ఆదాయం రూ.33,666 కోట్ల నుంచి 12 శాతం క్షీణించి రూ.29,508 కోట్లకు తగ్గినట్లు టాటా స్టీల్ గ్రూప్ ఈడీ (ఫైనాన్స్ అండ్ కార్పొరేట్) కౌశిక్ చటర్జీ తెలిపారు. ఉక్కు డెలివరీలు 7.06 మిలియన్ టన్నుల నుంచి 6.94 మిలియన్ టన్నులకు తగ్గాయని చెప్పారు. ఒక్కో షేర్‌కు రూ.8 డివిడెండ్‌ను ప్రకటిస్తూ... కళింగనగర్ స్టీల్ ప్లాంట్ వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించిందన్నారు.
రూ.20,514 కోట్ల నగదు నిల్వలు
గత ఆర్థిక సంవత్సరంలో రూ.11,486 కోట్ల మూలధన పెట్టుబడుల్లో కళింగనగర్ ప్లాంట్‌పై రూ.3,695 కోట్లు వెచ్చించినట్లు చటర్జీ తెలిపారు. నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.20,514 కోట్లుగా ఉన్నాయని పేర్కొన్నారు. కీలకం కాని ఆస్తుల విక్రయాన్ని కొనసాగించామని, ఇలాంటి ఆస్తుల విక్రయం ద్వారా రూ.4,478 కోట్లు సమీకరించామని చెప్పారాయన.
యూరప్ కార్యకలాపాల పునర్వ్యస్థీకరణకు పలు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇక, 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.3,926 కోట్లుగా ఉన్న నికర నష్టాలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.3,049 కోట్లకు తగ్గాయని తెలిపారు. మొత్తం ఆదాయం రూ.1.40 లక్షల కోట్ల నుంచి రూ.1.17 లక్షల కోట్లకు తగ్గిందని చెప్పారు.