చిన్న పట్టణాలే లక్ష్యంగా ‘ట్యాక్స్ ఇట్ హియర్’
సాక్షి, అమరావతి: మున్ముందు అంతా ఆదాయ పన్ను రిటర్నులు తప్పనిసరిగా దాఖలు చెయ్యాల్సిన పరిస్థితులు వస్తుండటంతో ఈ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి... ‘ట్యాక్స్ ఇట్ హియర్’ పేరిట విజయవాడ కేంద్రంగా ఫిన్‌టెక్ స్టార్టప్ కంపెనీ ఏర్పాటయింది.చిన్న పట్టణాల్లో ఐటీ రిటర్నులు దాఖలు చేయడంలో ప్రజలు, చిన్న వ్యాపార సంస్థలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఐదుగురు స్నేహితులతో కలసి దీన్ని ఆరంభించినట్లు ఫౌండర్ శ్రీకృష్ణ శీలం చెప్పారు.
రిఫండ్ ఇప్పించటంతో పాటు ఏడాది పొడుగునా ట్యాక్స్ సేవింగ్ సలహాలను అందించటం తమ ప్రత్యేకత అని ‘సాక్షి’తో చెప్పారు. ‘‘స్థానిక చార్టర్డ్ అకౌం టెంట్ల సేవలు తీసుకుంటూ ద్వితీయశ్రేణి పట్టణాలకు విస్తరించటానికి ప్రయత్నిస్తున్నాం. త్వరలోనే విశాఖ, తిరుపతి, వరంగల్ పట్టణాల్లో సేవలు ఆరంభిస్తాం. ఇప్పటికే విజయవాడలో 300 మం ది, బెంగళూరులో 128 మంది చార్టర్డ్ అకౌంటెట్స్‌తో ఒప్పందం చేసుకున్నాం.
ఎన్ని రకాల ఆదాయాలున్నప్పటికీ రూ.1,000లకే ఫైలింగ్ సేవలను మేం అందిస్తాం’’ అని ఆయన వివరించారు. తొలి ఏడాది కనీసం 5,000 మంది తమ ద్వారా రిటర్నులు దాఖలు చేస్తారన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇప్పటికే వుయ్‌ఆర్‌గాడ్జెట్స్ డాట్ కామ్, డీల్‌బర్ట్ డాట్ కామ్ వంటి తమ స్టార్టప్‌లు సక్సెస్ అయినట్లు శ్రీకృష్ణ చెప్పారు.
ఫండింగ్‌కు తొందర లేదు: రూ.60 లక్షల సొంత నిధులతో ట్యాక్స్ ఇట్ హియర్‌ను ఆరంభించామని శ్రీకృష్ణ చెప్పారు. ‘‘అమెరికాలోని టర్బోట్యాక్స్ సంస్థ స్ఫూర్తితో దీన్ని ప్రారంభించాం. తొలి ఫిన్‌టెక్ స్టార్టప్ కావడంతో ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ మేం తొందరపడటం లేదు. సంస్థ ఒక స్థాయికి చేరాక విస్తరణ సమయంలో నిధులపై దృష్టి పెడతాం’’ అని వివరించారు.
విద్యార్థులకు అవకాశం: విద్యార్థుల్లోని వ్యాపార ఆలోచనలను ప్రోత్సహించటానికి ఈ సంస్థ ‘ఇంటర్న్‌షిప్’ పోటీని నిర్వహిస్తోంది. డిగ్రీ తొలి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దీన్లో పాల్గొనవచ్చు. మొత్తం 160 మంది విద్యార్థులను ఎంపిక చేసి వారిని 80 టీమ్‌లుగా విభజించి పోటీ నిర్వహిస్తామని, వారికి రూ.85,000 నగదు, ఐదుగురికి సంస్థలో ఉద్యోగం కల్పిస్తామన్నారు. తొలి 5 స్టార్టప్ ఐడియాలకు ఏడాదిపాటు ఫండింగ్ ఇస్తామని చెప్పారు. వివరాలు ట్యాక్స్ ఇట్‌హియర్‌ఇంటర్న్‌షిప్.కామ్‌లో ఉంటాయి.