టీసీఎస్ ఆఫీసు మూత, ఆందోళనలో టెకీలు
లక్నో: దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) ఉత్తర ప్రదేశ్‌లోని తన కార్యాలయాన్ని మూసి వేయనుంది. సుదీర్ఘ కాలంగా ఐటీ సేవలను అందిస్తున్న లక్నో కేంద్రాన్ని మూసి వేసేందుకు సన్నాహాలు చేస్తోందని తాజా నివేదికల సమాచారం. ఈ ఏడాది చివరినాటికి లక్నో కార్యాలయాన్ని నోయిడాకు తరలించనుందని తెలుస్తోంది. ఈ మేరకు లీడర్లు ద్వారా తమకు సమాచారం అందిందని టీసీఎస్ లక్నో ఉద్యోగులు బుధవారం ఆరోపించారు.
టీసీఎస్ లక్నో ఆఫీసు తాళం వేయనుందని వార్త దాదాపు 2వేల మంది ఉద్యోగుల్లో(50శాతం మహిళలు) ఆందోళనకు దారి తీసింది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్‌ను వేడుకున్నారు. దీంతోపాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దినేశ్ శర్మలకు కూడా లేఖలు రాశారు.
మరోవైపు లక్నో కార్యాలయం మూసివేతపై వస్తున్న నివేదికలను టీసీఎస్ దృవీకరించింది. తక్కువ మంది ఉద్యోగులు, మెరుగ్గా లేని వ్యాపారం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. లక్నో ఆఫీసు మూతపై స్పందించిన టీసీఎస్ ఉద్యోగులను తీసివేయడం లేదని స్పష్టం చేసింది. ఈ ఉద్యోగులను నోయిడాకు, వారణాసికి మార్చుతున్నామని తెలిపింది. ఇక్కడ 1,000 మంది కంటే ఉద్యోగులను కలిగి ఉండటతో క్లయింట్ సేవలకు అనుకూలంగా లేదని భావించామని చెప్పింది. అలాగే యూపీలో ఆపరేష్లన్లు పటిష్టం చేసేందుకు చూస్తున్నామని వెల్లడించింది.
కాగా గత 33 ఏళ్లుగా టీసీఎస్ లక్నోలో తన సేవలను అందిస్తోంది.