ఫలితాలే దిక్సూచి..!
ఐఐపీ, ద్రవ్యోల్బణం గణాంకాలు కూడా..
* ఈ వారం మార్కెట్ గమనంపై నిపుణులు
* నేడు ఇన్ఫీతో కార్పొరేట్ ఫలితాల సీజన్ షురూ
* 13న టీసీఎస్, 14న హెచ్‌యూఎల్, 16న రిలయన్స్ ఆర్థిక ఫలితాలు...
న్యూఢిల్లీ: ప్రధానమైన బ్లూచిప్ కంపెనీల ఆర్థిక ఫలితాలు, స్థూల ఆర్థిక గణాంకాలు ఈ వారం మార్కెట్ గమనాన్ని నిర్ధేశించనున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. సమీప కాలానికి జూలై-సెప్టెంబర్(క్యూ2) ఫలితాలే ప్రధాన ట్రిగ్గర్‌గా నిలుస్తాయని చెబుతున్నారు.
అంతేకాకుండా ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధానికి కార్పొరేట్ కంపెనీలు ఇచ్చే గెడైన్స్(పనితీరు అంచనాలు)పై కూడా ఇన్వెస్టర్లు దృష్టిసారించనున్నట్లు నిపుణులు తెలిపారు. నేడు(సోమవారం) ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌తో క్యూ2 ఫలితాల సీజన్ ఆరంభమవుతోంది. 13న టీసీఎస్, 14న హిందుస్థాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) కూడా ఫలితాలను ప్రకటించనున్నాయి. ఆ తర్వాత వారాంతంలో(16న) దేశీ కార్పొరేట్ అగ్రగామి రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) ఫలితాలు వెలువడనున్నాయి.
‘కీలక కార్పొరేట్ల ఆర్థిక ఫలితాలతోపాటు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), ద్రవ్యోల్బణం గణాంకాలు, ప్రపంచ మార్కెట్ల ట్రెండ్ ఈ వారం మన స్టాక్ మార్కెట్ల ట్రెండ్‌కు దిక్సూచిగా నిలవనున్నాయి. అదేవిధంగా డాలరుతో రూపాయి మారక విలువ, ముడిచమురు ధరల కదలికలు సైతం కీలక పాత్ర పోషిస్తాయి’ అని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ వ్యవస్థాపక డెరైక్టర్ విజయ్ సింఘానియా వ్యాఖ్యానించారు.
కీలక గణాంకాలు...
మార్కెట్ సెంటిమెంట్‌ను బ్లూచిప్స్ ఫలితాలు ప్రభావితం చేయనున్నాయని, తీవ్ర ఒడిదుడుకులకు కూడా ఆస్కారం ఉండొచ్చని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ హితేష్ అగర్వాల్ పేర్కొన్నారు. మరోపక్క, నేడు కీలకమైన ఐఐపీ డేటాతో పాటు రిటైల్ ద్రవ్యోల్బణం గాణాంకాలు కూడా విడుదల కానున్నాయి. ఇన్వెస్టర్లు ఈ రెండింటిపైనా నిశితంగా దృష్టిపెడతారని ఆయన చెప్పారు. 14న టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం డేటా వెల్లడికానుంది. కాగా, విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) ధోరణి, డాలరుతో రూపాయి మారకం విలువ కదలికలు దేశీ సూచీల ట్రెండ్‌కు దిశానిర్దేశం చేయనున్నాయని క్యాపిటల్ వయా గ్లోబల్ రీసెర్చ్ డెరైక్టర్(రీసెర్చ్) వివేక్ గుప్తా అభిప్రాయం వ్యక్తం చేశారు.
గత వారం మార్కెట్...
అమెరికాలో సెప్టెంబర్ నెలకు ఉద్యోగ గణాంకాలు అంచనాల కంటే దిగువన నమోదు కావడంతో అక్కడి ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపును వాయిదా వేస్తుందన్న అంచనాలతో భారత్ సహా పలు విదేశీ స్టాక్ మార్కెట్లు రివ్వున ఎగబాకాయి. సెప్టెంబర్ 29న ఆర్‌బీఐ అనూహ్యంగా అర శాతం పాలసీ రేటు తగ్గింపు చర్య కూడా దేశీ మార్కెట్‌కు సంజీవనిలా పనిచేసింది. దీంతో గత వారంలోనూ దేశీ సూచీలు లాభాల జోరును కొనసాగించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 859 పాయింట్లు లాభపడి 27,080 వద్ద ముగిసింది. గడిచిన రెండు వారాల్లో సూచీ 1,216 పాయింట్లు(4.7%) ఎగబాకింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గత వారం 239 పాయింట్ల లాభంతో 8,190 వద్ద స్థిరపడింది.
మళ్లీ కొనుగోళ్ల బాటలో విదేశీ ఇన్వెస్టర్లు...
గత రెండు నెలలుగా భారీ మొత్తంలో పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) మళ్లీ కొనుగోళ్ల బాటలోకి వచ్చారు. ప్రస్తుత అక్టోబర్ నెలలో ఇప్పటివరకూ(10వ తేదీ) దేశీ మార్కెట్లలోకి నికరంగా రూ.2,013 కోట్ల నిధులను వెచ్చించారు. ఇందులో స్టాక్స్‌లో రూ.1,607 కోట్లు, బాండ్‌లలోకి(డెట్ మార్కెట్) రూ.406 కోట్ల చొప్పున పెట్టుబడిగా పెట్టినట్లు సెబీ తాజా గణాంకాలు వెల్లడించాయి.
ఆర్‌బీఐ అర శాతం రెపో రేటు కోతకు తోడు అమెరికా ఫెడ్ వడ్డీరేట్ల పెంపు వాయిదా అంచనాలు ఎఫ్‌పీఐలతో తిరిగి ఉత్సాహం నెలకొనేలా చేసిందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో రూ.23,000 కోట్లకు పైనే(ఈక్విటీ, డెట్ మార్కెట్) భారత్ నుంచి ఎఫ్‌పీఐలు నికరంగా ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. చైనాలో ఆర్థిక మందగమనం భయాల నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లు కుప్పకూలడం, ఫెడ్ వడ్డీరేట్లు పెంచుతుందన్న ఆందోళనలు దీనికి ప్రధాన కారణం. కాగా, ఈ ఏడాది ఇప్పటిదాకా ఎఫ్‌పీఐలు దేశీ స్టాక్స్‌లో రూ.22,654 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.39,802 కోట్లను నికరంగా ఇన్వెస్ట్ చేశారు.