టెల్కో సేవల నాణ్యత పై కేంద్రం దృష్టి
కాల్ డ్రాప్ సమస్య పరిష్కారానికి మొబైల్ నెట్‌వర్క్‌ల ఆడిట్ కేంద్ర టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడి
న్యూఢిల్లీ : తరచూ కాల్ డ్రాప్స్‌పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మొబైల్ నెట్‌వర్క్‌ల పనితీరును పరీక్షించేందుకు ప్రత్యేక ఆడిట్ నిర్వహించనున్నట్లు టెలికం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. తమ శాఖలో భాగమైన టెలికం ఎన్‌ఫోర్స్‌మెంట్, రిసోర్స్ అండ్ మానిటరింగ్ (టెర్మ్) విభాగం ఇది చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. కాల్ డ్రాప్ (అర్ధంతరంగా కాల్ కట్ అయిపోవడం) సమస్యకు మూలకారణాలు, టెల్కోలు పాటిస్తున్న ప్రమాణాలను అధ్యయనం చేసి తగు పరిష్కార మార్గాలను కనుగొనేందుకు ఈ ఆడిట్ ఉపయోగపడగలదని చెప్పారు.
నగరాల్లో డేటా వినియోగం, స్మార్ట్‌ఫోన్ల వాడకం గణనీయంగా పెరగడం వల్ల టెలికం నెట్‌వర్క్‌లపై తీవ్ర ఒత్తిడి ఉంటోందని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. మరోవైపు, టెల్కోల సేవల నాణ్యతను బట్టి ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు లేదా చర్యలు తీసుకునేందుకు తగు విధానాన్ని రూపొందించాలని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌కి సూచించినట్లు ఆయన వివరించారు.
‘డిజిటల్ ఇండియా’కు విశేష స్పందన
కేంద్ర ప్రతిష్టాత్మక ‘డిజిటల్ ఇండియా’ ప్రాజెక్టు పట్ల విశేష స్పందన లభిస్తోందని టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ మంగళవారం పేర్కొన్నారు. పరిశ్రమల నుంచి ఈ ప్రాజెక్టుకు సంబంధించి 75 బిలియన్ డాలర్ల (రూ.4,72,500 కోట్లు) పెట్టుబడులకు హామీ లభించినట్లు తెలిపారు. ఇండోఆఫ్రికా ఐసీటీ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన మంత్రి ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. దేశం సాంకేతికంగా పురోగతి సాధించడానికి కేంద్రం తగిన అన్ని చర్యలూ తీసుకుంటుందని రవి శంకర్ ప్రసాద్ ఈ సందర్భంగా అన్నారు.