బడి బాటలో బిల్డర్లు! | the International School in project on the campus | Sakshi
Sakshi News home page

బడి బాటలో బిల్డర్లు!

Published Sat, Apr 19 2014 2:02 AM | Last Updated on Sat, Sep 2 2017 6:12 AM

బడి బాటలో బిల్డర్లు!

బడి బాటలో బిల్డర్లు!

 ఇప్పటివరకు ఫ్లాట్‌ను విక్రయించాలంటే క్లబ్ హౌజ్, స్విమ్మింగ్ పూల్, ఏసీ జిమ్ వంటి ఆధునిక సదుపాయాలిస్తే చాలనుకునే వారు బిల్డర్లు. కానీ, ఇప్పుడలా కుదరదు. ఎందుకంటే కొనుగోలుదారుల అభిరుచిలో మార్పులొచ్చాయి. తమ పిల్లలు చదువుకునేందుకు పాఠశాల, ఆధునిక ఆసుపత్రి వంటివి కూడా ఉంటేనే ఫ్లాట్ కొంటామంటున్నారు. అవి కూడా ప్రాజెక్ట్ దగ్గర్లో కాదు ఏకంగా ప్రాజెక్ట్ ఆవరణలోనే ఉండాలని కోరుకుంటున్నారు. దీంతో బిల్డర్లు బడి బాట పడుతున్నారు. నగరంలో ఇటీవల పెరిగిపోయిన సరికొత్త సంస్కృతిపై
 ‘సాక్షి రియల్టీ’ ఈవారం ప్రత్యేక కథనం..

 సాక్షి, హైదరాబాద్: సొంతింటి ఎంపికలో విద్యాలయాలు, ఆసుపత్రులు కీలకంగా మారుతున్నాయి. అనారోగ్య సమస్యలు తలెత్తితే ఆసుపత్రికి వెళ్లేందుకు ఎక్కువ దూరం ప్రయాణం చేయడం, వర్షం కురుస్తున్నప్పుడు ఇంటి నుంచి కిలోమీటర్ల దూరముండే స్కూల్‌కు తమ పిల్లల్ని పంపించడం తల్లిదండ్రులు ఏమాత్రం ఇష్టపడట్లేదు. అందుకే ఫ్లాట్‌ను కొనుగోలు చేసేముందు పిల్లల అవసరాలు, ఆరోగ్యాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు.

 మరీ ఎక్కువగా వర్షాకాలంలో బస్సుల కోసం వేచి చూడటం తల్లిదండ్రులకు చిరాకు కలిగిస్తుంది. పిల్లలు వర్షంలో తడవకుండా ఇంటి నుంచే నేరుగా పాఠశాలకు వెళ్లగలరా? హఠాత్తుగా అనారోగ్యం తలెత్తితే వెంటనే ఆసుపత్రికి వెళ్లేందుకు వీలుగా ప్రాజెక్ట్‌లోనే ఆసుపత్రి ఉందా? వంటి అంశాలను క్షుణ్నంగా తెలుసుకుంటున్నారు. అందుకే ఫ్లాట్‌ను కొనేముందు క్లబ్ హౌజ్, స్విమ్మింగ్ పూల్, జిమ్ వంటి ఆధునిక సదుపాయాలే కాదు ప్రాజెక్ట్ ఆవరణలోనే పాఠశాల, ఆసుపత్రి వంటివి ఉంటేనే ఫ్లాట్ కొనేందుకు ముందుకొస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.

 శరవేగంగా అభివృద్ధి..
 ఇలాంటి ప్రాజెక్ట్‌లుండే ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయి. ఎలాగంటే కొనుగోలుదారుల కోసం, తమ వ్యాపారం కోసం తమ ప్రాజెక్ట్ ఆవరణలో పాఠశాలలు, ఆసుపత్రులు నెలకొల్పేందుకు బిల్డర్లు ఆయా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటారు. కొన్ని కంపెనీలైతే రీసెర్చ్ సెంటర్లకూ స్థానం కల్పిస్తాయి. దీంతో ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతం విద్యాలయాలు, ఆసుపత్రులతో కళకళలాడతాయి. దీంతో దేశ, విదేశీ కంపెనీలు ఆయా ప్రాంతాల్లో షాపింగ్ మాళ్లు, మల్టిప్లెక్స్‌ల వంటివి ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తాయి. దీంతో ఆయా ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయి.

 నగరంలోని పలు ప్రాజెక్ట్‌లివే..
  మహేశ్వరం మండలంలోని శ్రీనగర్ గ్రామంలో రాంకీ ఎస్టేట్స్ అండ్ ఫామ్స్ లిమిటెడ్ 600 ఎకరాల్లో ‘డిస్కవరీ సిటీ’ పేరుతో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌ను నిర్మిస్తోంది. ఇందులో మొత్తం 15 ఎకరాలు విద్యా సంస్థలకు కేటాయించారు. ఇప్పటికే 5 ఎకరాల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ పాఠశాల నడుస్తోంది. వాణిజ్య సంస్థలు, కార్యాలయాలు, ఆసుపత్రులు, థీమ్ పార్క్ వంటివెన్నో ఈ ప్రాజెక్ట్‌లో కొలువుదీరనున్నాయి.

 మూసాపేట్‌లో సైబర్‌సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ 68 ఎకరాల్లో ‘సైబర్‌సిటీ రెయిన్‌బో విస్టాస్’ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. ఇందులో ఫేజ్-1లో నెక్ట్స్‌జెన్ ప్లే స్కూల్, ఫేజ్-2లో ప్రైమరీ స్కూల్‌ను ఏర్పాటు చేయనుంది.

షాద్‌నగర్‌లో వాసుదేవా లే-అవుట్ డెవలపర్స్ ఇండియా ప్రై.లి. ‘డాక్టర్స్ కాలనీ’ పేరుతో సరికొత్త వెంచర్‌ను ప్రారంభించింది. ఇందులో ట్రిడెంట్ ఇంటర్నేషనల్ స్కూల్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేయనున్నారు.

 వర్షాకాలంలోనే వాస్తవాలు తెలుస్తాయ్..
 {పాజెక్ట్ ఆవరణలో స్కూలు, ఆసుపత్రి ఉన్నంత మాత్రానా ఫ్లాట్ కొనేందుకు సిద్ధమవకూడదు. ప్రాజెక్ట్‌లో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో తెలుసుకోవాలంటే వర్షాకాలమే సరైంది. సైటు వద్దకు ప్రత్యక్షంగా వెళ్లి పరిశీలించడం ఉత్తమం.

 వర్షాకాలంలో కొనుగోలుదారులు ఇంటిని కొనడానికి సైటు వద్దకెళితే రవాణా సదుపాయాల గురించి పక్కాగా తెలుస్తుంది. ఇంటి నుంచి ఆఫీసుకు, పిల్లలు స్కూలుకు సులువుగా చేరుకోగలరా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఇదే సరైన సమయం.

 {పజా రవాణా వ్యవస్థ మెరుగ్గా ఉందా? అత్యవసరాల్లో ఆటోలు దొరుకుతాయా? స్థానిక రైళ్లను సులువుగా అందుకోవచ్చా? ఇలాంటి అంశాలన్నీ వర్షా కాలంలోనే పక్కాగా తెలుస్తాయి.

 వర్షాకాలంలో అయితే ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతం ముంపులో ఉందా? లేక గడ్డ మీద ఉందా అనే విషయం ఇట్లే తెలిసిపోతుంది. వర్షాలు పడితే ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతమంతా నీరుతో నిండిపోతుందా? అనే అంశం టోకెన్ అడ్వాన్స్ ఇచ్చే ముందే తెలుసుకోవచ్చు.

 నిర్మాణపనులు ఆరంభమైనా నిర్మాణం చివరి స్థాయిలో ఉన్నా వర్షాకాలంలో వెళితే ఆయా కట్టడం వర్షాలకు గట్టిగా నిలుస్తుందా? లేదా అనే విషయం తెలుస్తుంది.

 గోడల్లో పగుళ్లు ఉన్నా, వర్షం నీరు కారుతున్నా పరీక్షించడానికి ఇంతకు మించిన సమయం లేదని గుర్తుంచుకోండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement