స్టేట్‌మెంట్‌తో సగం పని అయినట్లే!
గత వారం రిటర్న్ ఎలా దాఖలు చేయాలో నేర్చుకున్నాం. రిటర్న్ దాఖలు చేయడానికి ముందు ఆదాయ వివరాలకి సంబంధించి స్టేట్‌మెంట్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వారం తెలుసుకుందాం.
అసెస్సీకి వచ్చే ఆదాయం ఏ రూపంలో ఉన్నా దానికి సంబంధించిన వివరాలనిస్తూ దానికి సరిపడిన ఐటీఆర్ ఫారంతో రిటర్న్ దాఖలు చేస్తాం. దానికంటే ముందు అసెస్సీ ఒక స్టేట్‌మెంట్ ప్రిపేర్ చేసుకుంటే ఆ తరువాత రిటర్న్ దాఖలు చేయడం చాలా సులువవుతుంది.
స్టేట్‌మెంట్ ప్రిపేర్ చేయడం: అసెస్సీ తన ఆదాయ వివరాలతో సహా వ్యక్తిగత వివరాలు కూడా పొందుపరచి స్టేట్‌మెంట్ ప్రిపేర్ చేయాలి. అంటే అసెస్సీ పూర్తి పేరు, తండ్రి పేరు, చిరునామా, ఫోను నంబరు, ఆధార్ నంబరు, ఇన్‌కంట్యాక్స్ రేంజ్/వార్డ్ నంబరు, పుట్టిన తేదీ, పాన్ నంబరు, ట్యాక్స్ స్టేటస్, రెసిడె న్షియల్ స్టేటస్, ఆర్థిక సంవత్సరం అసెస్‌మెంట్ సంవత్సరం, అసెస్సీకి సరిపడే ఐటీఆర్ ఫారం నంబరు, ఈ మెయిల్ ఇలాంటి వివరాలతో స్టేట్‌మెంట్ ప్రిపేర్ చేయాలి.
స్టేట్‌మెంట్ ప్రిపేర్ చేయడం వల్ల అనేక లాభాలుంటాయి. ముందుగా అసెస్సీ ఐటీఆర్ ఫారంలో నింపే వివరాలన్నింటినీ కూడా ఒక స్టేట్‌మెంట్ రూపంలో తయారు చేసుకోవడం వల్ల ఎలాంటి పొరపాట్లు లేకుండా ఫైలింగ్ చేయడం సాధ్యపడుతుంది. అంతేకాకుండా అసెస్సీ ఆదాయానికి సంబంధించి ఎంత మేరకు పన్ను కట్టవలసి వస్తుందో లేక అసెస్సీకి ఏమైనా రిఫండ్ రూపంలో వస్తుందో ముందుగానే తెలుసుకోవడానికి వీలవుతుంది.
దాన్ని బట్టి అసెస్సీ పన్ను వివరాలు, ఆదాయ వివరాలు సరి చేసుకునే వీలుంటుంది. అసెస్సీకి ఎన్ని రకాలుగా ఆదాయమున్నా సరే స్టేట్‌మెంట్‌లో వివరంగా పొందుపరచుకోవచ్చు. ఫైలింగ్ చేయడానికంటే ముందుగానే వివరాలన్నీ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆదాయ వివరాలతో పాటు టీడీ ఎస్ వివరాలు కూడా పొందుపరచుకోవచ్చు.
ట్యాక్సేషన్ నిపుణులు
- కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి
- కె.వి.ఎన్. లావణ్య