ఉగ్రవాద కట్టడికి సోషల్ మీడియా తోడ్పడాలి: మోదీ
న్యూఢిల్లీ: ఉగ్రవాద కార్యకలాపాలను అణచడంలో సోషల్ మీడియా కూడా కీలక పాత్ర పోషించాలని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. అది ఏ విధంగా చేయాలన్న దానిపై నెట్‌వర్కింగ్ సైట్లు దృష్టి పెట్టాలన్నారు. సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జకర్‌బర్గ్‌తో శుక్రవారం భేటీ అయిన సందర్భంగా మోదీ ఈ విషయాలు పేర్కొన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. ఉగ్రవాద సంస్థలు కార్యకలాపాలను విస్తరించేందుకు సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్న అంశాన్ని, దీన్ని అరికట్టడంలో సోషల్ మీడియా పోషించాల్సిన పాత్ర గురించి మోదీ ప్రస్తావించారు.
అలాగే, స్వచ్ఛ్ భారత్ మిషన్‌తో పాటు పలు అంశాలను జకర్‌బర్గ్‌తో భేటీలో ఆయన చర్చించారు. స్వచ్ఛ్ భారత్ మిషన్‌కి తోడ్పాటునిచ్చేలా క్లీన్ ఇండియా మొబైల్ యాప్‌ను రూపొందించడంలో సహాయం అందిస్తామని జకర్‌బర్గ్ హామీ ఇచ్చారు. ఇక, గ్రామగ్రామానికి ఇంటర్నెట్‌ను చేరువ చేసేందుకు ఉద్దేశించిన డిజిటల్ ఇండియా కార్యక్రమంలో.. ఫేస్‌బుక్ ఏ మేరకు సహకారం అందించగలదో తెలియజేయాలని జకర్‌బర్గ్‌కు మోదీ సూచించారు. భారత్‌లోని పర్యాటక ప్రదేశాలు, విశేషాలను ఫేస్‌బుక్ ద్వారా మరింత ప్రాచుర్యంలోకి తేవాలని కోరారు. అంతకు ముందు .. కేంద్ర టెలికం మంత్రి రవి శంకర్‌తో కూడా జకర్‌బర్గ్ సమావేశమయ్యారు. డిజిటల్ సేవల విస్తృతికి సంబంధించిన ప్రాజెక్టుల ప్రతిపాదనల ఆమోదం కోసం పలువురు అధికారుల చుట్టూ తిరగకుండా నిర్దిష్టంగా ఎవరో ఒకరిని సూచించాలన్న జకర్‌బర్గ్ విజ్ఞప్తిపై రవిశంకర్ సానుకూలంగా స్పందించారు. ప్రత్యామ్నాయ టెక్నాలజీ ప్రాజెక్టులపై టెలికం శాఖ సం యుక్త కార్యదర్శి, ఐటీ సంయుక్త కార్యదర్శి ఈ అంశాలను పర్యవేక్షిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి.