బిహార్ ఎఫెక్ట్.. నేడు గ్యాప్‌డౌన్! | Time to cherry pick as markets react to Bihar | Sakshi
Sakshi News home page

బిహార్ ఎఫెక్ట్.. నేడు గ్యాప్‌డౌన్!

Published Mon, Nov 9 2015 2:30 AM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM

బిహార్ ఎఫెక్ట్.. నేడు గ్యాప్‌డౌన్! - Sakshi

బిహార్ ఎఫెక్ట్.. నేడు గ్యాప్‌డౌన్!

న్యూఢిల్లీ: బిహార్ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి ఘోర పరాజయాన్ని చవిచూడటం... దేశీ స్టాక్ మార్కెట్‌లకు షాక్ ఇచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. తాజా పరిణామంతో నేడు(సోమవారం) మార్కెట్ గ్యాప్‌డౌన్‌తో ఆరంభం కావచ్చని.. తదుపరి తీవ్ర ఒడిదుడుకులు ఉండొచ్చని వారు చెబుతున్నారు. రాజకీయంగా అత్యంత కీలకమైన రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు ఎన్‌డీఏకు ప్రతికూలంగా వెలువడటం పాటు కార్పొరేట్ ఫలితాలు చివరిదశకు చేరడం కూడా ఈ వారం మార్కెట్లపై ప్రభావం చూపనున్నట్లు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

నితీష్ కుమార్ నేతృత్వంలోని మహా కూటమి బిహార్‌లో భారీ ఆధిక్యంతో అధికారాన్ని కైవసం చేసుకోవడంతో ఎన్‌డీఏ సంస్కరణల అంజెండాకు అడ్డంకులు తప్పకపోవచ్చని సెంట్రమ్ బ్రోకింగ్ సీఈఓ కె. సందీప్ నాయక్ పేర్కొన్నారు. ముఖ్యంగా రాజ్యసభలో మోదీ సర్కారుకు తగినంత మెజారిటీ లేకపోవడాన్ని ఆయన ప్రస్తావించారు.

‘బిహార్ ఫలితాల అనిశ్చితి తొలగిపోయింది గనుక ఇన్వెస్టర్లు ఇక దేశీ అంశాలపై దృష్టిసారిస్తారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) వంటి పెండింగ్‌లో ఉన్న కీలక బిల్లులపై ఎలాంటి పురోగతి ఉంటుందనేది వేచిచూడాల్సి ఉంది. ఈ విషయంలో ప్రతిపక్షాలను మోదీ సర్కారు కొంత శాంతింపజేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

బిహార్ ఫలితాలు సోమవారం మార్కెట్లను కుదిపేసే అవకాశం ఉంది. ఆ తర్వాత నెమ్మదిగా కోలుకొన్ని కొంత స్థిరీకరణ జరగవచ్చు’ అని నాయక్ వ్యాఖ్యానించారు. కాగా, దీపావళి, బాలిప్రతిపదలను పురస్కరించుకొని బుధ, గురు వారాల్లో మార్కెట్లకు సెలవు ప్రకటించారు. అయితే, బుధవారం సాయంత్రం గంటన్నరపాటు ముహూరత్ ట్రేడింగ్ మాత్రం జరుగుతుంది.
 
అమెరికా వడ్డీరేట్ల పెంపు భయం...
అమెరికాలో అక్టోబర్ నెల ఉద్యోగ గణాంకాలు అంచనాలను మించడంతో అక్కడ వడ్డీరేట్ల పెంపు ఇక తప్పకపోవచ్చన్న అంచనాలు బలపడుతున్నాయి. ఉద్యోగాలు భారీగా పుంజుకోవడం, ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగుపడుతున్న సంకేతాల నేపథ్యంలో డిసెంబర్ సమీక్షలో దశాబ్దకాలం తర్వాత ఫెడ్ తొలిసారి రేట్లను పెంచుతుందన  వాదనలు పెరిగాయి.

ఈ వారం మన మార్కెట్లపై ఈ జాబ్స్ డేటా ప్రభావం కూడా ఉండొచ్చని నాయక్ అభిప్రాయపడ్డారు. బిహార్ ఎన్నికల ఫలితాలు, విదేశీ ఇన్వెస్టర్ల ధోరణి, డాలరుతో రూపాయి మారకం విలువ కదలికలు సమీప కాలానికి మార్కెట్లలో ట్రెండ్‌ను నిర్ధేశించనున్నాయని క్యాపిటల్ వయా గ్లోబల్ రీసెర్చ్‌కు చెంది వివేక్ గుప్తా పేర్కొన్నారు.

ఈ వారం వెలువడనున్న స్థూల ఆర్థిక గణంకాలు కూడా మార్కెట్‌ను ప్రభావితం చేయనున్నట్లు ఆయన చెప్పారు. అక్టోబర్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం, సెప్టెంబర్ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ఈ నెల 12న వెలువడనున్నాయి. ఈ వారం టాటా పవర్, ఆర్‌ఈసీ, హెచ్‌పీసీఎల్, కోల్ ఇండియా. హిందాల్కో తదితర కంపెనీలు ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి.
 
గత వారం మార్కెట్...
దేశీ మార్కెట్లు గత వారం కూడా నష్టాల్లోనే ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 392 పాయింట్లు దిగజారి 26,265 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 112 పాయింట్లు క్షీణతతో 7,954 వద్ద ముగిసింది.
 
ఐదు రోజుల్లో రూ.4,300 కోట్లు వెనక్కి...
న్యూఢిల్లీ:  విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ)ను అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు భయాలు వెంటాడుతున్నాయి. ఈ నెలలో తొలి ఐదు ట్రేడింగ్ సెషన్లలోనే ఎఫ్‌పీఐలు ఏకంగా రూ.4,300 కోట్ల పెట్టుబడులను భారత్ మార్కెట్ల నుంచి ఉపసంహరించుకోవడం దీనికి నిదర్శనం. డిసెంబర్‌లో ఫెడ్ వడ్డీరేట్లను పెంచుతుందన్న బలమైన అంచనాలకుతోడు, దేశీ కంపెనీల క్యూ2 ఫలితాలు కూడా అంతంతమాత్రంగానే ఉండటం ఎఫ్‌పీఐల తిరోగమనానికి కారణమని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
 
నవంబర్ 2-6 తేదీల మధ్య స్టాక్ మార్కెట్ల నుంచి నికరంగా రూ.2,667 కోట్లను, డెట్ మార్కెట్(బాండ్లు) నుంచి రూ.1,689 కోట్లను విదేశీ ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నట్లు సెబీ గణాంకాలు వెల్లడించాయి. కాగా, అక్టోబర్‌లో దేశీ మార్కెట్లో ఎఫ్‌పీఐల నికర పెట్టుబడులు ఏడు నెలల గరిష్టానికి (రూ. 22,350 కోట్లు) ఎగబాకిన సంగతి తెలిసిందే. ఇక చైనా ఆర్థిక మందగమనం

ఆందోళనల కారణంగా ప్రపంచ మార్కెట్లు తీవ్ర కుదుపులకు గురవడంతో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్ నుంచి రూ.23,000 కోట్లకు పైగా పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటివరకూ చూస్తే దేశీ స్టాక్ మార్కెట్లో రూ.25,030 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.53,408 కోట్లను ఎఫ్‌పీఐలు నికరంగా ఇన్వెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement