
న్యూఢిల్లీ: ఒకవైపు దేశంలో ఐపీవోల హవా నడుస్తుండగా భారతీయ ప్రధాన స్టాక్‌మార్కెట్ పెట్టుబడిదారు రాకేష్ ఝున్‌ఝున్ దేశీయ ఐపీవోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను భారత ఐపీవోలకు దూరంగా ఉండాలని సూచించారు. ముఖ‍్యంగా ఈక్విటీ మార్కెట్ల కొత్త గరిష్టాలు, పెట్టుబడుల ప్రవాహం నేపథ్యంలో ప్రస్తుతం ఐపీవోలకు దూరంగా ఉండాలని తాను విస్తున్నట్టు చెప్పారు.
గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ 2018 ఔట్‌లుక్ సమ్మిట్ లో ప్రసంగించిన ఝున్‌ఝున్ ఐపీవో మార్కెట్‌పై ఎక్కువ ప్రచారం జరుగుతోందని వీటికి దూరంగా ఉండాలని సూచించారు. అందుకే ఇటీవలి ఐపీవోలకు తాను దూరంగా ఉన్నానని ఇండియన్ వారెన్ బఫెట్ చెప్పారు. ఈ ఏడాది ఐపీఓలలో రికార్డుస్థాయిలో 11 బిలియన్ డాలర్లు సేకరించిందనీ, అయితే, హై వాల్యూమ్స్, ముఖ్యంగా ఇటీవల కొన్ని ఇన్సూరెన్స్ ఐపిఒలకు ఐపీవోలకు సెకండరీ మార్కెట్‌లో స్పందన బలహీనంగా ఉందని పేర్కొన్నారు. దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనపడిందన్నారు.
2016తరువాత భారీగా ర్యాలీ అయిన ఈక్విడీ మార్కెట్లు స్వల్ప-కాలిక వెనుకంజలో ఉన్నాయనీ, కానీ బుల్ మార్కెట్లో పతనం చాలా తీవ్రంగా ఉంటుందని, అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కార్పొరేట్ ఆదాయాలు పుంజుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. సెప్టెంబరు 30 తో ముగిసిన త్రైమాసికంలోఈ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. అలాగే 2018 సంవత్సరంలో రూపాయి మరింత బలహీనపడనుందని అంచనా వేశారు.