
న్యూఢిల్లీ: ఎవరో సృష్టించిన బిట్‌కాయిన్ కంటే మనకంటూ సొంతంగా ఓ క్రిప్టోకరెన్సీ ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించండి... ఈ ఆలోచనను ప్రముఖ మ్యూచువల్ ఫండ్ సంస్థ కోటక్ ఏఎంసీ ఎండీ నీలేష్ షా వ్యక్తం చేశారు. 200 బిలియన్ డాలర్ల భారీ మార్కెట్ విలువతో ఉన్న క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయడం కంటే స్వయంగా మనకంటూ క్రిప్టోకరెన్సీని సృష్టించుకోవచ్చుగా అన్నది షా అభిప్రాయం.
బిట్‌కాయిన్‌పై ప్రస్తుతం ఎంతో ఆసక్తి మన దగ్గరే అని కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా పెరిగిపోయింది. చాలా మంది ప్రముఖ విశ్లేషకులు సైతం ఇది ఇంకా భారీగా పెరుగుతుందని అంచనా వేస్తుంటే, పగిలేందుకు సిద్ధంగా ఉన్న బుడగ ఇదన్న వ్యాఖ్యానాలూ వినిపిస్తున్నాయి. అయితే, భారతీయులు సొంతంగా ‘ఇండికాయిన్’ను అభివృద్ధి చేసుకుంటే బిట్‌కాయిన్ గతంలోకి వెళ్లిపోతుందని నీలేష్ షా అన్నారు. ఇదే కనుక సాకారమైతే బిట్‌కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను ఇండికాయిన్ సునాయాసంగా దాటిపోతుందని అభిప్రాయపడ్డారు.
విదేశీయులనూ ఆకర్షించొచ్చు...
‘‘బిట్‌కాయిన్ పట్ల విపరీతమైన ఆసక్తి ఉంది. నా సూచన ఏమిటంటే 200 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ కలిగిన క్రిప్టో కరెన్సీలోకి ప్రవేశించడం కంటే మనం సొంతంగా ‘ఇండికాయిన్’ను ఎందుకు ఆవిష్కరించుకోరాదు. బిట్‌కాయిన్‌ను పోలిన ప్రోగ్రామ్‌ను ఇండికాయిన్ కోసం అభివృద్ధి చేయగల కంప్యూటేషనల్ నైపుణ్యాలు మనకున్నాయి. 40 కోట్ల మందికిపైగా ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. మన మధ్య వృత్తాకార ట్రేడింగ్‌ను సృష్టించుకోగలం. అంతేకాదు విదేశీయులను సైతం ఇండికాయిన్‌లో పాల్గొనేలా ఆకర్షించొచ్చు. ఒక్కో ఇండికాయిన్‌ను 20,000 డాలర్లకు తీసుకెళ్లడం ద్వారా 500 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను సృష్టించగలం. దీంతో విదేశీయుల చేతిలో ఇండికాయిన్లు, మన దగ్గర వారి డాలర్లు ఉంటాయి’’ అని షా పేర్కొన్నారు.
ఒక్క నెలలో మూడింతలు: బిట్‌కాయిన్‌పై ఇన్వెస్టర్లలో ఆసక్తి వెర్రితలలు వేస్తోంది. ఇందుకు నిదర్శనం ఈ క్రిప్టోకరెన్సీ ఒక్క నెలలో మూడు రెట్లు పెరగడమే. చికాగోకు చెందిన డెరివేటివ్ ఎక్సే్చంజ్ సీబోయె తాజాగా బిట్‌కాయిన్ ఫ్యూచర్ కాంట్రాక్టులను ఆదివారం నుంచి ప్రారంభించగా, ఒక్కరోజే 20 శాతం వరకు పెరిగిపోవడం గమనార్హం. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర 17,000 డాలర్లకు అటుఇటుగా కదలాడుతోంది.
ఆర్‌బీఐ హెచ్చరికలు: దేశీయంగా బిట్‌కాయిన్లపై ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య పెరిగిపోతుండటంతో రిజర్వ్ బ్యాంకు ఇప్పటికే పలు మార్లు హెచ్చరికలు జారీ చేసింది. క్రిప్టోకరెన్సీల్లో ట్రేడింగ్ చేయడం ద్వారా ఆర్థిక, నిర్వహణ, చట్టబద్ధమైన, రక్షణకు సంబంధించిన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హితవు పలికింది. బిట్‌కాయిన్ తరహా వర్చువల్ కరెన్సీల సృష్టి, వాటిని చెల్లింపులకు మాధ్యమంగా వాడుకోవడాన్ని ఏ కేంద్ర బ్యాంకు కూడా ఆమోదించలేదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. బిట్‌కాయిన్ అన్నది ఓ బుడగ వంటిదని టెంపుల్‌టన్ ఈఎం గ్రూపు మార్క్‌మోబియన్ ఇటీవలే ప్రకటించారు కూడా.
త్వరలోనే ‘ఆయిల్‌కాయిన్’
బిట్‌కాయిన్లు, క్రిప్టోకరెన్సీల ర్యాలీ ఒకవైపు నడుస్తుంటే... మరోవైపు అమెరికా సర్కారు సైతం ఓ క్రిప్టో కరెన్సీకి ప్రణాళిక రచించింది. నియంత్రణలతో కూడిన డిజిటల్ కరెన్సీ ఆయిల్ కాయిన్లను ప్రవేశపెడుతోంది. వీటికి ధ్రువీకరించిన చమురు ఆస్తులు హామీగా ఉండనున్నాయి. వచ్చే జనవరిలోనే తొలి టోకెన్ విక్రయం జరగనుంది. ఆయిల్‌కాయిన్‌ను కొనుగోలు చేయదలిచిన వారు చట్టబద్ధమైన కరెన్సీతో మార్పిడి చేసుకోవాల్సి ఉంటుంది. టోకెన్ ధర, చట్టబద్ధమైన కరెన్సీలో ఎంతుండాలన్నది అమెరికా అధికారులు నిర్ణయించాల్సి ఉంది. ఆయిల్‌కాయిన్లకు అమెరికా ప్రభుత్వం హామీ ఇస్తుంది.
ఇవి ఎలా పనిచేస్తాయంటే...?
ఆయిల్‌కాయిన్లు టోకెన్ల మాదిరిగా పనిచేస్తాయి. ప్రతీ ఆయిల్‌కాయిన్ ఒక బ్యారెల్ చమురు విలువకు ప్రతిరూపంగా ఉంటుంది. చలామణిలోకి విడుదల చేసిన ఆయిల్‌కాయిన్ల విలువ అమెరికాలో అన్ని రకాల చమురు ఆస్తుల విలువకు సమాన స్థాయిలో ఉంటుంది. ఈ డిజిటల్ కరెన్సీ కలిగి ఉన్న వారు దాన్ని ఆయిల్ బ్యారెల్స్, ఆయిల్‌కు సంబంధించిన ఆస్తులతోనే మార్చుకోగలరని దీనిపై రూపొందించిన నివేదిక పత్రాలు పేర్కొంటున్నాయి. ప్రపంచ క్రూడ్ మార్కెట్‌లో పెరిగే డిమాండ్‌ను తట్టుకునేందుకే ఆయిల్‌కాయిన్ల వెనుక ఉద్దేశ్యమని తెలుస్తోంది.
బిట్‌కాయిన్ లాభం చెప్పకుంటే 50% పెనాల్టీ!
బిట్‌కాయిన్ రోజుకో కొత్త శిఖరానికి చేరుతూ రికార్డులను తిరగరాస్తున్న నేపథ్యంలో ఈ డిజిటల్ కరెన్సీ ద్వారా ఆర్జించే సంపాదనపై కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలోనే పన్ను విధించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ ఏడాదిలో 1,400% వరకు పెరిగిన ఈ క్రిప్టోకరెన్సీని పన్ను పరిధిలోనికి తెచ్చేందుకు ఒక కమిటీని ఏర్పాటుచేసే దిశగా కేంద్రం నిర్ణయం తీసుకోనుందని సమాచారం.
బిట్‌కాయిన్ లావాదేవీల పర్యవేక్షణ, స్వల్పకాలిక లాభాలను ఆర్జించిన వారిపై 30% పన్ను వేయడం లాంటి అంశాలతో పాటు, ఈ తరహా ఆర్జనను వెల్లడించని వారిపై ఏకంగా 50% పన్ను, జరిమానాను సైతం విధించాలని యోచిస్తోంది. దీనిపై అధ్యయనం చేసి తుది నివేదికను అందించేందుకు ఆర్‌బీఐ, ఐటీ, ఇతర కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని అధికారులతో కమిటీని ఏర్పాటు చేయనుంది.
క్రిప్టోకరెన్సీ ద్వారా జరిగే మనీల్యాండరింగ్ చర్యలకు అడ్డుకట్టవేయడం, ఇతర దేశాలలో ఈ కరెన్సీపై అమలవుతున్న మార్గదర్శకాలను అధ్యయనం చేయడానికి ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్ర ఒక కమిటీని నియమించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కరెన్సీ ద్వారా ఆర్జిస్తున్న సంపాదనపై పన్ను విధించేందుకు మరో కమిటీని నియమించనుందని తెలుస్తోంది. ఈ కరెన్సీ ద్వారా ఆర్జించిన మొత్తంపై షార్ట్–టర్మ్ క్యాపిటల్ గెయిన్ పన్ను 30% ఉంటుందని వెల్లడయ్యింది.