బ్యాంకు అవసరం లేకుండానే లావాదేవీలు
► త్వరలోనే విపణిలోకి బ్లాక్ చెయిన్ టెక్నాలజీ
► అభివృద్ధి చేస్తున్న ఐడీఆర్‌బీటీ: డైరెక్టర్ ఏఎస్ రామశాస్త్రి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘‘సాధారణంగా బ్యాంకు కస్టమర్లు తమ లావాదేవీల కోసం బ్యాంకు లేదా ఆర్ధిక సంస్థల వంటి థర్డ్ పార్టీ మాధ్యమాన్ని వినియోగిస్తుంటారు. అయితే బ్లాక్ చెయిన్ వేదిక ద్వారా థర్డ్ పార్టీ అవసరం లేకుండా నేరుగా కస్టమర్, సప్లయర్ అనుసంధానం అవుతారు. అంటే బ్యాంకు అవసరం లేకుండానే లావాదేవీలు జరిపే వీలుంటుంది’’ అని ఇనిస్టిట్యూట్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ (ఐడీఆర్‌బీటీ) డైరెక్టర్ ఏఎస్ రామశాస్త్రి తెలిపారు.
శుక్రవారమిక్కడ ఐడీఆర్‌బీటీ 13వ బ్యాంకింగ్ టెక్నాలజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, అనలిటిక్స్ టెక్నాలజీ సొల్యూషన్స్‌లో 3 పేటెంట్ల కోసం దరఖాస్తు చేశామని తెలియజేశారు. అనంతరం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుదర్శన్ సేన్ మాట్లాడుతూ.. ఆర్‌బీఐ, ఐడీఆర్‌బీటీ, ఫిన్‌టెక్ కంపెనీలు సంయుక్తంగా కలిసి బ్లాక్‌చెయిన్ ప్రాజెక్ట్‌ను విజయవంతం చేయడంలో భాగస్వామ్యం కావాలని కోరారు.
హాజరుకాని కనుంగో... : వాస్తవానికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నరు బి.పి.కనుంగో హాజరు కావాల్సి ఉంది. ఆయన రాకపోవటంతో ఆయన పంపిన సందేశాన్ని ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్ గణేష్ కుమార్ చదివి వినిపించారు. ‘‘సామాజిక మాధ్యమాల ద్వారా వ్యక్తిగత సమాచారం సేకరించి.. మోసాలకు పాల్పడటం పెరుగుతున్నట్లు కనుంగో తన సందేశంలో అభిప్రాయపడ్డారు.
ఈ–మెయిళ్లు, మెసేజ్‌ల ద్వారా వచ్చే ఆయాచిత అభ్యర్థనలను స్వీకరించడం, స్పందించడం పెరగడమే ఇందుకు కారణమన్నారు. బ్యాంకులు తమ ఐటీ వ్యవస్థను భద్రతకు తగిన ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. సురక్షిత బ్యాంకింగ్ విధానంపై బ్యాంకులు వినియోగదారులకు అవగాహన కల్పిస్తూనే ఉన్నాయని అయినా సైబర్ దాడులను పూర్తి స్థాయిలో నివారించలేకపోతున్నామన్నారు. తెలివైన మోసగాళ్లు, సాధారణ బ్యాంకింగ్ వ్యవస్థ ఈ రెండు కారణాలే ఇందుకు కారణమని వివరించారు.