Elon Musk Jack Dorsey Hates Web 3.0: web3.. మనలో చాలామందికి ఈ పదం తెలిసి ఉండకపోవచ్చు. కానీ, రాబోయే రోజులు మాత్రం వెబ్3 గురించి పదే పదే వినాల్సి రావడం ఖాయం. ఎందుకంటే.. ఇది ఇంటర్నెట్‌లో ఓ తరం కాబట్టి. అయితే దీనిపై కొందరు టెక్ మేధావులకు తీవ్ర వ్యతిరేకత ఉంది. అందుకు కారణాలేంటో తెలుసుకునే ముందు.. అసలు వెబ్3 అంటే ఏంటో చూద్దాం.
టిమ్ బెర్నర్స్ లీ 1989లో వరల్డ్ వైడ్ వెబ్‌ను లాంఛ్ చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిని ‘వెబ్ 1’గా పరిగణనలోకి తీసుకోకపోయినా.. జనాల్ని ఆన్‌లైన్‌లోని వెళ్లేలా చేసింది మాత్రం ఇదే. కానీ, ఆ తర్వాతి తరంలో వచ్చిన ఇంటర్నెట్‌కు వెబ్ 2.0 అనే పేరు అధికారికంగా వచ్చింది. 1999 నుంచి ఇది అనేక రకాలుగా యావత్ ప్రపంచం విస్తరించి కోట్ల మందిని ఇంటర్నెట్ బ్రౌజింగ్‌కు దగ్గర చేసింది. ఇక మూడో తరం ఇంటర్నెట్ పేరే ‘వెబ్ 3.0’. దీనికి బీజం పడింది 2014లోనే!.
నో డామినేషన్
2014లో బ్రిటన్ కంప్యూటర్ సైంటిస్ట్ గావిన్ వుడ్ ‘ఎథెరియం’(క్రిప్టోకరెన్సీ) రూపొందించాడు. ఎథెరియం ప్రకారం.. ఇంటర్నెట్‌ను వికేంద్రీకరించడమే 3.0 ఉద్దేశం. అంటే.. బ్లాక్‌చెయిన్ ఆధారంగా ఇంటర్నెట్‌ను డీసెంట్రలైజ్డ్ చేయడం. తద్వారా గూగుల్, ఫేస్‌బుక్‌లాంటి దిగ్గజాల ఆధిపత్యం ఇంటర్నెట్‌లో నడవదు. ఇంటర్నెట్ యూజర్ కాస్త యజమాని అవుతాడు. ఇందులో భాగంగానే ప్రతీదానికి బ్లాక్‌చెయిన్స్‌తో ముడిపడి ఈ తరం ఇంటర్నెట్ నడుస్తోంది.
టైం పట్టొచ్చు
వెబ్3.0లో ఎలాంటి సేవలు వినియోగించుకోవాలన్నా.. ఎవరి అనుమతులు అక్కర్లేదు. ఎవరూ బ్లాక్ చెయ్యరు. సేవల్ని వినియోగించుకోవడానికి తిరస్కరించరు. టోకెన్స్, క్రిప్టోకరెన్సీల ఆధారంగా చెల్లింపులు చేసే వెసులుబాటు ఉంటుంది. ఒకరకంగా వెబ్ 3.0 వల్లే క్రిప్టో కరెన్సీ, ఎన్‌ఎఫ్‌టీలు చాలా ఏళ్ల క్రితమే వాడుకలోకి రాగలిగాయన్నమాట. అయితే ఇది ఇంటర్నెట్‌ను చూసే తీరును మార్చేస్తుందా? అంటే అవుననే చెప్పొచ్చు. కానీ, అందుకు చాలా టైం పట్టే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే అది ఎక్కువ మందికి రీచ్ కావాలి కాబట్టి అని చెప్తున్నారు.
ఎందుకు మెచ్చట్లేదు
థర్డ్ జనరేషన్.. ఈ పదం వినడానికే టెక్ దిగ్గజాలు ఇష్టపడడం లేదు. వినడానికే దరిద్రంగా ఉందంటూ ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ఇంతకు ముందు కామెంట్ చేశాడు. తాజాగా ‘ఎవరైనా చూశారా? నాకైతే కనిపించలేదు. జస్ట్ అదొక మార్కెటింగ్ బజ్‌వర్డ్’ అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఇక ట్విటర్ మాజీ సీఈవో జాక్ డోర్సే ‘ఇంటర్నెట్ అనేది వెంచర్ క్యాపిటలిస్ట్‌లకు మాత్రమే సొంతమని, జనాలు దానిని పొందలేర’ని సోమవారం ట్వీట్ చేశాడు. వీళ్లిద్దరిదే కాదు యాపిల్ సీఈవో టిమ్ కుక్ సహా చాలామంది అభిప్రాయమూ ఇదే. ఈ తరహా ఇంటర్నెట్‌ను సాధారణ పౌరులు ఉపయోగించడం కష్టమని, కాబట్టి, ఇదొక విఫలయత్నంగా అభివర్ణిస్తున్నారు.
అయితే థర్డ్‌జనరేషన్ ఇంటర్నెట్ ద్వారా యూజర్ సులువుగా బిలియనీర్ అయిపోవచ్చు. విపరీతంగా సంపాదించొచ్చు. రిస్క్ రేటు తక్కువే. ఈ కారణం చేతనే కుళ్లుకుంటున్నారని వాదించేవాళ్లు లేకపోలేదు. ఇక 90లో ఫోన్ల రాక సమయంలోనూ ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం అయ్యింది. కట్ చేస్తే.. పరిస్థితి ఏంటో తెలిసిందే కదా. అలా థర్డ్ జనరేషన్ ఇంటర్నెట్ కూడా సక్సెస్ అయ్యి తీరుతుందని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment