
ట్రాన్స్‌మిషన్ టవర్స్ తయారీపై ఒప్పందం
ఆర్‌ఐఎన్‌ఎల్, పవర్‌గ్రిడ్‌ల మధ్య జేవీ
సాక్షి,ఉక్కునగరం: విశాఖ స్టీల్‌ప్లాంట్, పవర్ గ్రిడ్‌ల మధ్య ట్రాన్స్‌మిషన్ లైన్ టవర్ల తయారీపై భాగస్వామ్య(జేవీ) ఒప్పందం కుదిరింది. బుధవారం గుర్గావ్‌లో జరిగిన కార్యక్రమంలో ఆర్‌ఐఎన్‌ఎల్-పవర్ గ్రిడ్ టీఎల్‌టీ లిమిటెడ్ పేరిట విశాఖపట్టణంలో ఏర్పాటు చేయనున్న తయారీ యూనిట్ 50:50 భాగస్వామ్యంతో ఏర్పాటు చే యడానికి అంగీకరించారు. ఆర్‌ఐఎన్‌ఎల్ సీఎండీ పి.మధుసూదన్, డెరైక్టర్(ప్రాజెక్ట్స్) పి.సి.మహాపాత్ర, పవర్‌గ్రిడ్ సీఎండీ ఆర్.ఎన్.నాయక్, డెరైక్టర్(ప్రాజెక్ట్స్) ఐ.ఎస్.ఝా సమక్షంలో ఆర్‌ఐఎన్‌ఎల్ జీఎం(ప్రాజెక్ట్స్) విల్సన్ డేవిడ్, పవర్‌గ్రిడ్ జిఎం అఖిల్ కుమార్‌లు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
మొదటి దశలో రూ. 330 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ యూనిట్‌లో ఏడాదికి 1,20,000 టన్నులను ఉత్పత్తి చేయనున్నారు. రెండో దశలో ఈ యూనిట్ సామర్థ్యాన్ని 1,80,000లకు పెంచాలని నిర్ణయించారు. ఈ ఉత్పత్తికి అవసరమైన బ్లాక్ ఏంగిల్స్ ఆర్‌ఐఎన్‌ఎల్ సరఫరా చేస్తుంది. ఆర్‌ఐఎన్‌ఎల్ ఈ యూనిట్‌కు చెందిన స్థలాన్ని ఇప్పటికే సిద్ధం చేయగా మెకాన్ సంస్థ ప్రాజెక్ట్‌కు నివేదికను సిద్ధం చేసింది.