మూడు టెక్ స్టార్టప్ లలో టీవీఎస్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: టీవీఎస్ గ్రూప్‌కు చెందిన టీవీఎస్ ఆటోమొబైల్ సొల్యూషన్స్(టీవీఎస్ ఏఎస్‌ఎల్) సంస్థ మూడు స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టింది. కంపెనీ డిజిటల్ ప్రయత్నాల్లో భాగంగా ఈ స్టార్టప్‌ల్లో ఇన్వెస్ట్ చేశామని టీవీఎస్ ఏఎస్‌ఎల్ వివరించింది. ఇప్పటివరకూ వివిధ టెక్నాలజీ స్టార్టప్‌లలో రూ.75 కోట్ల వరకూ పెట్టుబడులు పెట్టామని టీవీఎస్ ఏఎస్‌ఎల్ ఈడీ జి.శ్రీనివాస రాఘవన్ చెప్పారు. ఈ కొత్త వ్యాపారాల నుంచి మూడేళ్లలో రూ.250 కోట్ల ఆదాయం లభించగలదని అంచనాలున్నాయని వివరించారు. జాజ్‌మైరైడ్‌డాట్‌కామ్(ప్రయాణికుల, వాణిజ్య, ద్విచక్ర వాహన విడిభాగాలు, యాక్సెసరీలకు సంబంధించిన ఈ-కామర్స్ సంస్థ), ఆటోసెన్స్(టెక్నాలజీ, ఎనలిటిక్స్ ఆధారిత కస్టమర్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ సంస్థ), రెడ్‌సన్(ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ రంగంలోని కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థ)ల్లో పెట్టుబడులు పెట్టామని పేర్కొన్నారు.