
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : క్యాబ్ డ్రైవర్లు ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ అడపా దడపా ఫిర్యాదులు వస్తున్న విషయం తెల్సిందే. విదేశాల్లో అయితే క్యాబ్ డ్రైవర్లు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు మహిళల నుంచి ఫిర్యాదులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద టాక్సీల నెట్‌వర్క్ కలిగిన ‘ఉబర్’ ముందు జాగ్రత్త చర్యగా తన యాప్‌లో సరికొత్త ఫీచర్‌ను ప్రవేశ పెట్టబోతోంది. అదే ‘వాయిస్ ఆడియో రికార్డింగ్’ ఫీచర్. ఎందుకంటే డ్రైవర్, ప్రయాణికుల మధ్య జరిగే సంభాషణలను ఎప్పటికప్పుడు రికార్డు చేయడం కోసం. దీన్ని ముందుగా ప్రయోగాత్మకంగా వచ్చే నెల నుంచి లాటిన్ అమెరికా దేశాల్లో ప్రవేశపెట్టి, ఆ తర్వాత అమెరికాకు విస్తరిస్తామని ఉబర్ యాజమాన్యం తెలిపినట్లు ఓ అమెరికా మీడియా తెలిపింది. కారులో ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని పేర్కొంది.
అదే విధంగా ఈ ఆడియో రికార్డింగ్ డ్రైవర్‌కుగానీ, ప్రయాణికులకుగానీ అందుబాటులో ఉండదని, ట్రిప్పు ముగియగానే ప్రయాణం సౌకర్యంగానే జరిగిందా ? అన్న ప్రశ్న ప్రయాణికులకు వెళుతుందని, వారి నుంచి సానుకూలమైన సమాధానం వచ్చినట్లయితే ఆడియో స్క్రిప్టును ప్రయాణికుల మాటలను విశ్లేషించే అనుబంధ ఏజెంట్‌కు పంపుతారని, ప్రయాణికులకు, డ్రైవర్ మధ్య ఇబ్బందులు, ఘర్షణ పరిస్థితి ఏర్పడితే పోలీసులకు అందజేయడం కోసం ఆడియో రికార్డింగ్‌ను భద్రపరుస్తామని ఉబర్ యాజమాన్యం వెల్లడించింది. అనవసరంగా ఎవరి ప్రైవసీని దెబ్బతీయమని తెలియజేసింది. అమెరికాలో ప్రజల ప్రైవసీకి సంబంధించి వివిధ రాష్ట్రాల్లో వేరు వేరు చట్టాలున్నాయని, డ్రైవర్, ప్రయాణికుల మాటలను రికార్డు చేయాలంటే వారిరువురి అనుమతి తప్పనిసరని మీడియా ఉబర్ యాజమాన్యం దృష్టికి తీసుకపోగా అప్పటికీ ఒకే జాతీయ చట్టం రావచ్చేమోనని వ్యాఖ్యానించింది. ప్రయోగాత్మకంగా అమెరికాలో కూడా ‘ఆడియో రికార్డింగ్ ఫీచర్’ విజయవంతం అయితే ఇతర దేశాలకు విస్తరించే అంశాన్ని పరిశీలిస్తామని యాజమాన్యం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment