ఎవరు.. ఏ ఫారం దాఖలు చేయాలి..  | Various Business Person Which IT Return Documents Are Used To Fill | Sakshi
Sakshi News home page

ఎవరు.. ఏ ఫారం దాఖలు చేయాలి.. 

Published Mon, Aug 12 2019 8:24 AM | Last Updated on Mon, Aug 12 2019 8:31 AM

Various Business Person Which IT Return Documents Are Used To Fill - Sakshi

ఒక వ్యక్తి ఏయే ఫారంల ద్వారా రిటర్నులు దాఖలు చెయ్యాలో ఈ వారం తెలుసుకుందాం. గతంలో వేతన జీవులకొక ఫారం, ఇతరులకొక ఫారం అంటూ రెండే ఉండేవి. కాలక్రమంలో ఎన్నో మార్పు.. ఎన్నో ఫారాలు.. మొత్తం వాడుకలో ఉన్న ఏడు ఫారాలలో నాలుగు ఫారాలు వ్యక్తులకు వర్తిస్తాయి. వివరాల్లోకి వెళితే..
 

ప్రస్తుతం ప్రీఫిల్డ్‌ ఫారాలు అమల్లో ఉన్నాయి. ఐటీ సైట్‌లోకి వెళ్లి  my account  ఆప్షన్‌లోకి వెడితే.. Prefilled XML ఉంటుంది. ఫారం 26 అలోని వివరాలు కనిపిస్తాయి. జీతం, పెన్షన్, వడ్డీ.. తదితరసమాచారం ఇందులో ఉంటుంది. ఐటీ ట్యాక్స్‌ వివరాలు ఉంటాయి. 

ఐటీఆర్‌1
వ్యక్తులు.. రెసిడెంట్‌ అయి ఉండి, నికర ఆదాయం రూ. 50 లక్షలు దాటని వారు ఈ ఫారం వేయాల్సి ఉంటుంది. విదేశీ ఆదాయం ఉండకూడదు. ఏదేని సంస్థలో డైరెక్టర్‌ అయి ఉండకూడదు. వ్యాపారం, క్యాపిటల్‌ గెయిన్స్‌ ఉండకూడదు. ఏ వనరు ద్వారా కూడా నష్టం ఉండకూడదు. ఒక ఇంటి నుంచే ఆదాయం ఉండాలి. మరో విధంగా చెప్పాలంటే.. కేవలం జీతం, వడ్డీ, ఒక ఇంటి మీద ఆదాయం (నష్టం కాదు) ఉన్న వారు ఈ ఫారం దాఖలు చేయాలి. వ్యవసాయం మీద ఆదాయం, డివిడెండ్లు రూ. 5,000 దాటకపోతే కూడా వేయొచ్చు.

ఐటీఆర్‌ 2 
వ్యక్తులు మరియు ఉమ్మడి కుటుంబాలు ఈ ఫారం దాఖలు చేయొచ్చు. జీతం, ఇంటి మీద ఆదాయం (నష్టం ఉన్నా ఫర్వాలేదు), ఇతర ఆదాయాలు, క్యాపిటల్‌ గెయిన్స్‌ ఉన్న వారు మాత్రమే దీన్ని ఉపయోగించవచ్చు. నాన్‌ రెసిడెంట్లు కూడా ఈ ఫారం వేయొచ్చు. అయితే, వారు తమ ట్యాక్స్‌ ఐడెంటిటీ నంబరు ఇవ్వాలి. నికర ఆదాయం రూ. 50 లక్షలు దాటిన వారు దీన్ని దాఖలు చేయాల్సి ఉంటుంది. స్థిరాస్తుల వివరాలు, షేర్లు, బంగారం, ఆభరణాలు, వాహనాలు, పెయింటింగ్, కళాత్మక వస్తువులు, బ్యాంకు డిపాజిట్లు, ఇన్సూరెన్స్‌ పాలసీలు, రావల్సిన అప్పులు, నగదు మొదలైన వివరాలు ఇందులో పొందుపర్చాలి. ఆస్తులను కొన్న ధర చూపాలే తప్ప ప్రస్తుత మార్కెట్‌ విలువ కాదు. నష్టం, సర్దుబాటు చూపొచ్చు.

ఐటీఆర్‌ 3 
ట్యాక్స్‌ క్రెడిట్‌ పరిధిలోకి రానివారు, పలు వనరుల నుంచి ఆదాయం ఉన్నవారు.. అంటే జీతం, ఇంటద్దె, క్యాపిటల్‌ గెయిన్స్, ఇతరత్రా వ్యాపారం.. వృత్తిగత ఆదాయాలు ఉన్నవారు దీన్ని దాఖలు చేయొచ్చు. ఇది పెద్ద ఫారం. చాలా వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. నాన్‌ రెసిడెంట్లు, వ్యక్తులు, ఉమ్మడి కుటుంబాలు దీన్ని వేయొచ్చు. ఆస్తులు.. అప్పుల పట్టీ, స్థూల ఆదాయం, ఖర్చుల వివరాలు, నగదు, బ్యాంకు నిల్వల వివరాలు ఇందులో పొందుపర్చాలి.

ఐటీఆర్‌ 4
ఇది రెసిడెంట్లు మాత్రమే ఉపయోగించగలిగే ఫారం. వ్యక్తులు, హిందు ఉమ్మడి కుటుంబాలు దీన్ని దాఖలు చేయొచ్చు. వ్యాపారం మీద స్థూల ఆదాయం/టర్నోవరు రూ. 2 కోట్లు దాటకూడదు. వృత్తి నిపుణుల స్థూల ఆదాయం రూ. 50,00,000 దాటకూడదు. ఒక ఇంటి మీద మాత్రమే ఆదాయం ఉండాలి. నికర ఆదాయం రూ. 50 లక్షలు దాటకూడదు. ఊహాజనిత ఆదాయాలున్న వారు దీన్ని వేయొచ్చు. ఈ ఫారాన్ని ఒకసారి వేస్తే.. వరుసగా అయిదేళ్ల పాటు ఇదే ఫారం దాఖలు చేయడం కొనసాగించాల్సి ఉంటుంది. ఏదైనా కారణం వల్ల ఫారం 3 వేస్తే రాబోయే అయిదు సంవత్సరాలు కూడా ఫారం 3 మాత్రమే వేయాల్సి ఉంటుంది. ఇంకా సందేహాలు ఉంటే వృత్తి నిపుణులను సంప్రతించండి. ఐటీ రిటర్నులను మీరే స్వయంగా దాఖలు చేసుకోవచ్చు. అయితే, ఈ విషయంలో కొంత జాగ్రత్త వహించండి. తప్పులు చేయొద్దు. ఆదాయాన్ని చూపించడం మానొద్దు. లేకపోతే 50–200% దాకా జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement