డిపాజిట్ రేటు తగ్గించిన విజయాబ్యాంక్
ఇదే బాటన యాక్సిస్ బ్యాంక్
బెంగళూరు: ప్రభుత్వ రంగ విజయాబ్యాంక్ డిపాజిట్లపై వడ్డీరేటును పావుశాతం తగ్గించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్) విధానాన్ని ఏప్రిల్ 1 నుంచీ అమలు చేస్తున్న నేపథ్యంలో ఇందుకు అనుగుణంగా బ్యాంక్ డిపాజిట్ రేటును సవరించింది. 91 రోజుల నుంచి ఐదేళ్లపైన మెచ్యూరిటీల వరకూ కొత్త డిపాజిట్ రేట్లు ఏప్రిల్ 12 నుంచీ అమలవుతాయని తెలిపింది. ఏడాది మెచ్యూరిటీపై ఆకర్షణీయమైన 7.5 శాతం వడ్డీరేటును ఆఫర్ చేస్తున్నట్లు కూడా బ్యాంక్ తెలిపింది.
రుణ రేటును తన పోటీ బ్యాంకులకు అనుగుణంగా తగ్గించినట్లు యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. ఎంసీఎల్‌ఆర్‌కు అనుగుణంగా ఓవర్‌నైట్ రేటును 15 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు పేర్కొంటూ... దీనితో రుణ రేటు 8.95 శాతానికి తగ్గినట్లు తెలిపింది. తాజా 15 బేసిస్ పాయింట్ల తగ్గింపు ఏప్రిల్ 18 నుంచీ అమల్లోకి వస్తుందని తెలిపింది. బ్యాంక్ తన బేస్ రుణ రేటు కూడా 0.05 శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 9.45 శాతం తగ్గింది.