న్యూఢిల్లీ: ఏస్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్.. భారత డిజిటల్ చెల్లింపుల సంస్థ, పేటీఎమ్‌లో పెట్టుబడులు పెట్టనున్నారు. బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హతావే.. పేటీఎమ్‌ను నిర్వహిస్తున్న వన్97 కమ్యూనికేషన్స్ సంస్థలో 3–4% వాటాను కొనుగోలు చేయనున్నదని సమాచారం. ఈ వాటా కోసం బెర్క్‌షైర్ సంస్థ 30–35 కోట్ల డాలర్ల(రూ.2,200–2,500 కోట్లు) మేర పెట్టుబడులు పెట్టనున్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ విషయాన్ని వన్97 కమ్యూనికేషన్స్ త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నదని ఆ వర్గాలు తెలిపాయి.
పేటీఎమ్‌కు నిధుల బలిమి
ఈ లెక్కన పేటీఎమ్ కంపెనీ విలువ 1,000 కోట్ల డాలర్లని అంచనా. కాగా ఈ విషయమై బెర్క్‌షైర్ హతావే స్పందించలేదు. పేటీఎమ్ ప్రతినిధి వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. ఒకవేళ ఈ డీల్ సాకారమైతే, బఫెట్‌కు భారత్ టెక్నాలజీ రంగంలో తొలి ఇన్వెస్ట్‌మెంట్ ఇదే అవుతుంది. అంతేకాకుండా ప్రపంచంలోనే ప్రైవేట్ రంగంలోని(స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాని) టెక్నాలజీ కంపెనీలో బఫెట్‌కు తొలి పెట్టుబడి కూడా ఇదే కానున్నది.
గతంలో ఆయన ఐబీఎమ్, యాపిల్ వంటి లిస్టెడ్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేశారు. ఇటీవలనే ఐబీఎమ్ నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం ఫోన్ పే, గూగుల్ తేజ్‌లతో తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్న పేటీఎమ్‌కు ఈ తాజా పెట్టుబడులు మంచి బలాన్ని ఇస్తాయని నిపుణులంటున్నారు. పేటీఎమ్ సంస్థ, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్, ఈ–కామర్స్ రంగాల్లోకి విస్తరించే ప్రయత్నాలు చేస్తోంది. కాగా గత ఏడాది మేలో పేటీఎమ్‌లో జపాన్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ రూ.9,079 కోట్ల మేర పెట్టుబడులు పెట్టింది.
పేటీఎమ్... టాప్ త్రీ కన్సూమర్ ఇంటర్నెట్ కంపెనీల్లో ఒకటి
2011లో వారెన్ బఫెట్ బెర్క్‌షైర్ ఇండియాను ఏర్పాటు చేశారు. బీమా వ్యాపారం కోసం బజాజ్ అలయంజ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. రెండేళ్ల తర్వాత ఈ భాగస్వామ్యం నుంచి వైదొలిగారు. భారత్‌లో బీమా రంగానికి సంబంధించి నియమనిబంధనలు కఠినంగా ఉండటమే దీనికి కారణమని అంటారు. కాగా ఇప్పటికే పేటీఎమ్‌లో ప్రపంచ దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్, చైనా ఆలీబాబా గ్రూప్, యాంట్ ఫైనాన్షియల్, ఎస్‌ఏఐఎఫ్ పార్ట్‌నర్స్, మీడియాటెక్‌లు పేటీఎమ్‌లో ఇన్వెస్ట్ చేశాయి.
పేటీఎమ్‌లో నెలకు 400 కోట్ల డాలర్ల విలువైన లావాదేవీలు జరుగుతాయని అంచనా. ఈ ఏడాది జూన్‌తో ముగిసిన క్వార్టర్‌కు 130 కోట్ల లావాదేవీలు జరిగాయి. 2000 సంవత్సరంలో వన్97ను విజయ్ శేఖర్ శర్మ ప్రారంభించారు. ఆరంభంలో మొబైల్ చెల్లింపులు, మొబైల్ రీచార్జ్ వ్యాపారం చేసే ఈ కంపెనీ ప్రస్తుతం భారత్‌లో టాప్ త్రీ కన్సూమర్ ఇంటర్నెట్ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. కాగా, బెర్క్‌షైర్ హతావే కంపెనీ ట్యాక్సీ అగ్రిగేటర్ ఉబెర్‌లో పెట్టుబడులు పెట్టనున్నదని ఈ ఏడాది మేలో వార్తలు హల్‌చల్ చేశాయి. కానీ అవి సాకారం కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment