విదేశీ పెట్టుబడుల ఆక ర్షించేందుకు సంస్కరణలు: జైట్లీ
దావోస్: దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రైవేట్ రంగ పెట్టుబడులు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు తగిన నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేస్తామని పేర్కొన్నారు. ప్రపంచం భారత్‌ను వృద్ధి దేశంగా పరిగణిస్తోందన్నారు. ప్రపంచంలో కేవలం భారత్ మాత్రమే 7 శాతంపైగా వృద్ధిరేటును నమోదు చేస్తోందని చెప్పారు.
ఇన్వెస్టర్లకు భారత్‌పై సానుకూల దృక్పథం ఉందని, వారు భారత్‌ను వృద్ధి అవకాశాల దేశంగా చూస్తున్నారని అందుకే అధిక మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నారని తెలిపారు. డబ్ల్యూఈఎఫ్ కార్యక్రమం ఆనంతరం ఆయన పీటీఐ ప్రతినిధితో మాట్లాడారు. తాము నిర్మాణాత్మక సంస్కరణలను కొనసాగిస్తామని, భారత ఆర్థిక వ్యవస్థ విశ్వసనీయతను పెంపొందిస్తామని పేర్కొన్నారు.
ప్రైవేట్ రంగ పెట్టుబడుల పునరుద్ధరణకు, విదేశీ పెట్టుబడుల ఆకర్షణపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిందన్నారు. చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందని, అమెరికా కూడా కొన్ని సమస్యలతో సతమతమౌతోందని, యూరప్‌లో అస్థిరత పరిస్థితులు ఉన్నాయని చెప్పారు.