న్యూఢిల్లీ: భారత్‌ను నాలుగో పారిశ్రామిక విప్లవ కేంద్రానికి వేదికగా ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) ఎంచుకుంది. ఈ కేంద్రాన్ని ప్రధాని మోదీ గురువారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆవిష్కరించారు. ప్రభుత్వం, వ్యాపార సంస్థలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి నూతన టెక్నాలజీ విధానాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కేంద్రం పనిచేయనుంది. ఈ కేంద్రం మహారాష్ట్రలో ఏర్పాటు కానుంది. డ్రోన్లు, కృత్రిమ మేథ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్), బ్లాక్‌చెయిన్ టెక్నాలజీలను తొలి మూడు ప్రాజెక్టులుగా పరిగణనలోకి తీసుకుంది. వీటిలో ముందుగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్‌లర్నింగ్, బ్లాక్‌చెయిన్‌పై ఎక్కువగా దృష్టి పెట్టనున్నట్టు డబ్ల్యూఈఎఫ్ ప్రకటించింది. జాతీయ స్థాయిలో ప్రభుత్వ సహకారంతో, దిగ్గజ వ్యాపార సంస్థలు, విద్యారంగం, స్టార్టప్‌లు, అంతర్జాతీయ సంస్థలతో కలసి నూతన విధానాలను రూపొందించడంతోపాటు, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఙానాలకు ప్రోటోకాల్స్ తీసుకురానున్నట్టు డబ్ల్యూఈఎఫ్ తెలిపింది. కేంద్రం తరఫున నీతి ఆయోగ్ ఈ భాగస్వామ్యాన్ని సమన్వయపరుస్తుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలతో డబ్ల్యూఈఎఫ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. మరిన్ని రాష్ట్రాలతోనూ ఈ విధమైన భాగస్వామ్యం రానున్న రోజుల్లో ఉంటుందని డబ్ల్యూఈఎఫ్ తెలిపింది. ‘‘ఏ విధంగా మనం తయారు చేస్తాం, ఏ విధంగా వినియోగించుకుంటాం, ఏ విధంగా సంప్రదింపులు చేస్తాం, ఏ విధంగా జీవిస్తామన్న దాన్ని నాలుగో పారిశ్రామిక విప్లవం మార్చివేయనుంది’’ అని డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు క్లౌస్‌ష్వాబ్ తెలిపారు.
ఈ విప్లవంతో మరిన్ని ఉద్యోగాలు: ప్రధాని
నాలుగో పారిశ్రామిక విప్లవం ఉద్యోగాల స్వరూపాన్ని మార్చేస్తుందని, మరిన్ని ఉపాధి అవకాశాలు అందివస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. టెక్నాలజీ అభివృద్ధితో ఉద్యోగాలు పోతాయన్న భయాలను తేలికపరిచే ప్రయత్నం చేశారు. నాలుగో పారిశ్రామిక విప్లవ కేంద్రం ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడారు. నాలుగో పారిశ్రామిక విప్లవ ఫలాలను పొందేందుకు విధానాల్లో మార్పులు తీసుకువచ్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ‘‘మన వైవిధ్యం, జనాభా సంఖ్య పరంగా సానుకూలత, వేగంగా వృద్ధి చెందే మార్కెట్, డిజిటల్ మౌలిక సదుపాయాలు అనేవి పరిశోధన, అమలు విషయంలో భారత్‌ను ప్రపంచ కేంద్రంగా మార్చగలిగే సామర్థ్యాలున్నవి’’ అని పేర్కొన్నారు. గత పారిశ్రామిక విప్లవాల్లో భారత్ పాల్గొనలేకపోయినందున, నాలుగో పారిశ్రామిక విప్లవంతో భారత్ పాత్ర ఆశ్చర్యకరమైన రీతిలో ఉంటుందని చెప్పారు. ‘‘మొదటి రెండు పారిశ్రామిక విప్లవాల సమయంలో భారత్ స్వతంత్ర దేశం కాదు. మూడో పారిశ్రామిక విప్లవం సందర్భంలో స్వాతంత్య్రం కారణంగా వచ్చిన సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో ఉంది’’ అని ప్రధాని వివరించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్ చెయిన్, బిగ్‌డేటా అనేవి భారత్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళతాయన్నారు. తమ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరిస్తూ... దేశంలో టెలీ సాంద్రత 93 శాతానికి చేరిందని, 50 కోట్ల మంది మొబైల్స్ వాడుతున్నారని చెప్పారు. ప్రపంచంలో ఎక్కువగా డేటా వినియోగించే దేశం మనదని, అదే సమయంలో చౌక రేట్లున్నాయన్నారు. దేశంలో 120 కోట్ల మందికి ఆధార్ ఉందని, 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు ఆప్టిక్ ఫైబర్ అనుసంధానత త్వరలోనే పూర్తవుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment