ఇన్ఫోసిస్ లో ఏం జరుగుతోంది! | What's cooking in Infosys Limited | Sakshi
Sakshi News home page

ఇన్ఫోసిస్ లో ఏం జరుగుతోంది!

Published Tue, Jun 10 2014 4:02 PM | Last Updated on Sat, Sep 2 2017 8:35 AM

ఇన్ఫోసిస్ లో ఏం జరుగుతోంది!

ఇన్ఫోసిస్ లో ఏం జరుగుతోంది!

దేశ టెక్నాలజీ రంగంలో ఐటీ దిగ్గజం ఇన్పోసిస్ లిమిటెడ్ అగ్రస్థానమేనని చెప్పడానికి ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఎన్నో ఐటీ కంపెనీలకు మార్గదర్శకంగా నిలిచిన ఇన్పోసిస్ కంపెనీ ఇటీవల కాలంలో కొన్ని ఒడిదుడుకులకు లోనవుతున్నట్టు కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇన్ఫోసిస్ ను కొన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. గతంలో ఎంతో ఘనకీర్తిని సంపాదించుకున్న ఇన్పోసిస్ సహవ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి చైర్మన్ స్థానం నుంచి తప్పుకున్న తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. 
 
ఇటీవల కాలంలో  సీనియర్లే కాక యువ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు కూడా ఇన్పోసిస్ ను భారీ సంఖ్యలో వదిలి వెళ్లినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత 12 నెలల కాలంలో 12 మంది సీనియర్లు తమ పదవుల నుంచి తప్పుకోవడం చర్చనీయాంశమవుతోంది. జనవరి-మార్చి మధ్యకాలంలోనే 8996 మంది ఉద్యోగులు ఇన్పోసిస్ ను వదిలి వెళ్లినట్టు తెలుస్తోంది. వివిధ కారణాలతో గత 12 నెలల్లో దాదాపు 36 వేలకు పైగానే ఐటీ దిగ్గజానికి టాటా చెప్పనట్టు తెలుస్తోంది. మార్చి 2015 సంవత్సరంలో ఇన్పోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎస్.డీ శిబులాల్ కూడా రిటైరయ్యేందుకు సిద్దమవుతున్నారు. 
 
ఇన్పోసిస్ కంపెనీ వదిలేసి వెళ్తున్న ఉద్యోగులను ఆపేందుకు ఏడు శాతం మేరకు జీతాలను పెంపు చేశారు. ఐనా కంపెనీ నుంచి ఉద్యోగుల వెళ్లడం మాత్రం తగ్గుముఖం పట్టలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. 1981లో నారాయణ మూర్తితో పాటు ఇన్పోసిస్ ను స్థాపించిన ఎన్ఎస్ రాఘవన్, ఎస్ గోపాలకృష్ణన్, నందన్ నీలెకని, శిబులాల్, కే.దినేష్ రాజీనామాలు సమర్పించిన వారిలో ఉన్నారు. వారేకాకుండా సినియర్ ఎగ్జిక్యూటివ్స్ అశోక్ వేమూరి, బాసబ్ ప్రధాన్ లు కూడా ఇన్పోసిస్ కు గుడ్ బై చెప్పారు. లోకసభ ఎన్నికల్లో పోటి చేసేందుకుగాను బాలకృష్ణన్ తప్పుకున్నారు. ఇన్పోసిస్ ను వదిలి వెళ్లే జాబితాలో తాజాగా 19 ఏళ్లపాటు సేవలందించిన సేల్స్, మార్కెటింగ్ హెడ్, వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ త్రికూటం తన పదవికి రాజీనామా చేయడం ఉద్యోగుల్లో మరింత అభద్రతభావాన్ని పెంచే దిశగా దారి తీసినట్టు తెలుస్తోంది. 
 
ఐతే యువ ఉద్యోగులు కంపెనీని విడిచి వెళ్లడానికి వారానికోసారి కొత్త విధానాల్ని ఉద్యోగులపై రుద్దడం ప్రధాన కారణమని వినిపిస్తోంది. ఉద్యోగులను సంప్రదించకుండానే 8.8 పనిగంటల నుంచి 9.25 గంటలకు పెంచడం ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమైనట్టు సమాచారం. పనిగంటల పెంపు కూడా ఉద్యోగుల్లో అభద్రతాభావాన్ని పెంచడమే కాకుండా కంటి తుడుపు చర్యగా జీతాలను పెంపు చేయడం కూడా ఉద్యోగులను సంతృప్తి పరచలేకపోయింది. ముఖ్యంగా ప్రశ్నించిన ఉద్యోగులను ఎలాంటి సమాచారం లేకుండా తొలగించినట్టు తెలుస్తోంది. ఇన్పోసిస్ లో కొనసాగుతున్న అప్రజాస్వామిక విధానాలను బహిరంగంగా మాజీ ఉద్యోగులు, ప్రస్తుత ఉద్యోగులు ఇంటర్నెట్ వెబ్ సైట్లు, బ్లాగ్ ల్లో స్పందిస్తున్నారు. 
 
ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఉన్న సీనియర్ ఉద్యోగులు ఎలాంటి ప్రోడక్టవిటీ లేకుండా సేవలందించడం కూడా దిగువ తరగతి ఉద్యోగుల్లో నిరాసక్తత పెంచినట్టు తెలుస్తోంది. 13 ఏళ్లకు పైబడి అనుభవం ఉన్న ఉద్యోగులందరిని తొలగించినా.. కంపెనీపై ఎలాంటి ప్రభావం చూపబోదని యువ ఉద్యోగులు వివిధ బ్లాగుల్లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇన్పోసిస్ లో చోటు చేసుకుంటున్న పలు పరిస్థితులపై వీడియోల రూపంలో, ఇంటర్నెట్ బ్లాగుల్లో కథనాలు భారీగానే పబ్లిష్ అవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో తీవ్ర ఒడిదుడుకులెదుర్కొంటున్న ఇన్పోసిస్ లో పరిస్థితులు సానుకూలంగా మారుతాయనే అభిప్రాయాన్ని పలువురు ఆశిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement