
ఆర్థిక లావాదేవీలన్నింటికీ కీలకం బ్యాంకు ఖాతాయే. మ్యూచువల్ ఫండ్స్‌ను సిప్ చేయాలన్నా, స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టాలన్నా, బిల్లులు చెల్లించాలన్నా... ఇంకా బీమా ప్రీమియం, ఈఎంఐలు... వచ్చే ఆదాయానికి, వెళ్లే ఖర్చులకు బ్యాంకు ఖాతాయే కీలకం. కానీ, దురదృష్టవశాత్తూ ఖాతాదారుడికి ఏదైనా జరిగితే పరిస్థితేంటి? బోంబే హైకోర్టు ముందుకు ఈ మధ్యే ఓ పిటిషన్ వచ్చింది. 63 ఏళ్ల మహిళ తన భర్త అపస్మారక స్థితికి చేరుకోవడంతో చికిత్సకయ్యే ఖర్చులను అతడి బ్యాంకు ఖాతా నుంచి చెల్లించబోయింది. నిబంధనలు అడ్డుతగిలాయి. దీంతో తనను గార్డియన్‌గా నియమించాలని కోరుతూ ఆమె కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. కొన్ని సందర్భాల్లో నియంత్రణలు మంచివే. కానీ, అన్నివేళలా కాదు. కాబట్టి బ్యాంకు ఖాతా నిర్వహించటమెలా? మీ ఖాతాపై మీ కుటుంబ సభ్యులకు అవాంతరాల్లేని అధికారం ఇవ్వడం ఎలా? అనే వివరాలు తెలియజేసేదే ఈ కథనం...
నామినేషన్ తప్పనిసరి...
బ్యాంకులో ఖాతా ప్రారంభంలోనే నామినేషన్‌ను నమోదు చేయడం మర్చిపోవద్దు. ఖాతాదారుడు మరణించిన సందర్భాల్లో ఖాతాకు సంబంధించిన క్లెయిమ్‌లను సులభతరం చేస్తుంది. నిజానికి నామినీగా ఉండేవారు చట్ట బద్ధమైన వారసులే కానక్కర్లేదు. వేర్వేరు కావచ్చు. నామినీ ఎవరినీ పేర్కొనకపోతే ఖాతాలో ఉన్న నగదు, ఫైనల్ సెటిల్‌మెంట్‌కు వారసులే అర్హులవుతారని ఫెడరల్ బ్యాంకు డిజిటల్ బ్యాంకింగ్ హెడ్ కేఏ బాబు తెలియజేశారు.
ఒకరి పేరును ఖాతాకు నామినీగా ఇచ్చి ఉంటే, ఆ తర్వాత ఎప్పుడు అవసరమైతే అప్పుడు, ఎన్ని సార్లయినా నామినీని మార్చుకునే అవకాశం ఉంటుంది. కానీ, ఖాతాదారుడు లేదా లాకర్ యజమాని జీవించి ఉండి, కోమాలోకి వెళ్లడం లేదా ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అచేతనంగా మారితే ఏంటి పరిస్థితి...? ఇటువంటి సందర్భాల్లో బ్యాంకు నామినీకి ఖాతాపై అధికారం ఇవ్వదు. ఈ నేపథ్యంలో జాయింట్ అకౌంట్ ఒక్కటే పరిష్కారం. ఈ జాయింట్ అకౌంట్‌లోనూ (ఇద్దరు లేదా ముగ్గురు ఉమ్మడిగా ప్రారంభించే ఖాతా) పలు వర్గీకరణాలున్నాయి.
ఇద్దరూ లేదా ఏ ఒక్కరైనా...
‘ఐదర్ ఆర్ సర్వైవర్’ అని పేర్కొనే ఈ ఖాతాను ఖాతాదారులు ఇద్దరూ నిర్వహించుకోవచ్చు. ఇద్దరికీ సంపూర్ణ హక్కులు ఉంటాయి. ఏ లావాదేవీకి సంబంధించినదైనా ఇద్దరూ కలిసి సంతకాలు పెట్టాల్సిన అవసరం లేదు. జాయింట్ ఖాతా అయినప్పటికీ ఎవరికి అవసరమైనప్పుడు వారు లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. కనుక భార్యా, భర్తలు ఉమ్మడిగా ఈ ఖాతాను కలిగి ఉండడం లాభదాయకం.
జాయింటు ఖాతా అవసరమా...?
జాయింట్ ఖాతాకు పలు ప్రయోజనాలున్నాయి. ఇద్దరు ఖాతాదారులూ ఖాతాను అవసరమైనప్పుడు నిర్వహించుకోవచ్చు. దంపతులు అయితే వారు తమ ఆర్థిక లావాదేవీలను ఒకే ఖాతా నుంచి సులభంగా సమీక్షించుకోవచ్చు. ఐదర్ ఆర్ సర్వైవర్ ఖాతాకు నామినేషన్ ఇచ్చి ఉన్నప్పటికీ, ఖాతాదారుడు మరణిస్తే రెండో ఖాతాదారుడికే అధికారం లభిస్తుంది కానీ, నామినీకి కాదు. ఇద్దరు ఖాతాదారులు మరణించిన తర్వాతే నామినీ అవసరం వస్తుంది.
తొలి ఖాతాదారు తరవాతే...
ఫార్మర్ ఆర్ సర్వైవర్... అని పేర్కొనే ఈ ఖాతా కూడా ఉమ్మడి ఖాతానే అయినప్పటికీ ఖాతాను మొదటి ఖాతాదారుడే (ఫార్మర్) నిర్వహించేందుకు అనుమతి ఉంటుంది. కాల వ్యవధికి ముందే డిపాజిట్ మొత్తాన్ని చెల్లించేటట్టు అయితే ఇద్దరి సంతకాలూ అవసరం అవుతాయి. ఒకవేళ ఖాతాదారుడికి ఏదైనా జరిగితే అప్పుడు సర్వైవర్ లేదా రెండో ఖాతాదారుడు ఆ ఖాతాపై అధికారం పొందుతారు.
అయితే, ఈ విధంగా ఖాతా నిర్వహణకు అనుమతి పొందేందుకు ఖాతాదారుడి మరణ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. రెండో ఖాతాదారుడు ఖాతాపై అధికారాన్ని రెండు రకాల పరిస్థితులో పొందొచ్చు. మొదటి ఖాతాదారుడు మరణించినప్పుడు లేదా ఇద్దరు ఖాతాదారులు కలసి దరఖాస్తు ఇచ్చిన సందర్భంలో. మొదటి ఖాతాదారుడు జీవించి ఉండగా, రెండో ఖాతాదారుడికి అధికారికం ఇచ్చే చట్టబద్ధమైన హక్కు బ్యాంకుకు లేదు. ఈ సందర్భాల్లో కోర్టు నుంచి డిక్రీ పొందాల్సి ఉంటుంది’’ అని ఫెడరల్ బ్యాంకుకు చెందిన కేఏ బాబు వివరించారు.
ఖాతాదారుడు నిర్వహించలేని పరిస్థితుల్లో...
ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం ఖాతాదారుడు అనారోగ్యం కారణంగా చెక్కుపై సంతకం చేయలేని, బ్యాంకు శాఖకు వచ్చి నగదు విత్‌డ్రా చేసుకోలేని శారీరక అచేతన పరిస్థితుల్లో ఉంటే... చెక్కు లేదా విత్‌డ్రాయల్ ఫామ్‌పై వేలిముద్రను వేయవచ్చు. కాకపోతే బ్యాంకుకు తెలిసిన ఇద్దరు సాక్షులు దీన్ని ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఇందులో ఒకరు బ్యాంకు ఉద్యోగి అయి ఉండాలి. అలాగే, శారీరకంగా కదల్లేని పరిస్థితుల్లో బ్యాంకుకు రాలేని, వేలి ముద్ర వేయలేని పరిస్థితి ఉంటే అతని తరఫున ఎవరైనా తమ వేలి ముద్రలను చేయవచ్చు. కాకపోతే దీన్ని ఇద్దరు సాక్షులు ధ్రువీకరించాలి. వారిలో ఒకరు బ్యాంకు ఉద్యోగి అయి ఉండడం తప్పనిసరి.
ప్రత్యామ్నాయ మార్గమిదీ...
జాయింట్ ఖాతా విషయంలో ఐదర్ ఆర్ సర్వైవర్ ఎంచుకోవచ్చని ‘లాడర్ 7’ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ వ్యవస్థాపకులు సురేష్ సెడగోపన్ సూచించారు. అలాగే, పవర్ ఆఫ్ అటార్నీ (పీవోఏ) కూడా పరిశీలించొచ్చన్నారు. పీవోఏ అన్నది ఓ వ్యక్తి తరఫున కొన్ని రకాల చర్యలు నిర్వహించేందుకు ఓ వ్యక్తికి అధికారాలను చట్టబద్ధంగా ఇవ్వడం. స్థిర, చరాస్తులకూ ఇది వర్తిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ తమ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ముందుచూపుతో నామినేషన్ లేదా పీవోఏ ఇవ్వడం ద్వారా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అలాగే, అన్ని పత్రాలను ఒకేచోట అందుబాటులో ఉంచడం అవసరం.