పనగారియా ఎందుకు తప్పుకున్నారు?
న్యూఢిల్లీ: ఆర్థిక ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పాటు చేసిన ‘నీతి ఆయోగ్’ వైస్ చైర్మన్ పదవికి ప్రముఖ ఆర్థిక నిపుణులు అరవింద్ పనగారియా ఎందుకు రాజీనామా చేశారు? గుజరాత్ తరహా పాలన అందించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తన ఆర్థిక గురువు జగదీశ్ భగవతితోపాటు ఎప్పుడూ సన్నిహితంగా ఉండే పనగారియా అర్ధాంతరంగా ఎందుకు కీలక పదవి నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది?
పనగారియా ఆలోచన మేర కే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రైల్వే బడ్జెట్‌ను జనరల్ బడ్జెట్‌లో కలిపేశారు. పట్టణ ఆరోగ్య వ్యవస్థను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖతో మంతనాలు జరుపుతున్న తరుణంలోనే ఆయన పదవిని వదులుకున్నారు. భారీ నష్టాల్లో నడుస్తున్న భారత విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను కూడా ప్రైవేటీకరించాలన్నది ఆయన బలమైన ఆకాంక్ష. ఇటు కేంద్ర, అటు రాష్ట్ర ప్రభుత్వాల ద్రవ్యలోటును తగ్గించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలన్నది ఆయన భవిష్యత్తు వ్యూహం. ఆయన సూచనమేరకే దేశంలో పెద్ద నోట్లను ప్రధాని నరేంద్ర మోదీ రద్దు చేశారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆ నిర్ణయం బెడిసికొట్టిందన్న కారణంగా పనగారియా పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చిందా?
భారత్‌లో పనిచేసేందుకు న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి సెలవు తీసుకొని తాను వచ్చానని, సెలవు పొడిగించేందుకు యూనివర్శిటీ నిరాకరించడంతో తాను నీత్ ఆయోగ్ వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. ఇంత లేటు వయస్సులో అంత మంచి పదవి మళ్లీ దొరకదని, అందుకనే తిరిగి పాత ఉద్యోగానికి వెళుతున్నానని అన్నారు. ఆయన వాదన ఎంత బలహీనంగా ఉందో ఆయన మాటలనుబట్టి ఇట్టే తెలిసిపోతోంది. మరి, అలాంటప్పుడు ఆయన రాజీనామా వెనక బలమైన కారణాలు ఉన్నాయా?
కార్పొరేట్ ఎజెండాను పక్కన పెట్టాల్సిందిగా ఆయనపై ఆరెస్సెస్, దాని అనుబంధ సంస్థలైన స్వదేశీ జాగారన్ మంచ్, భారతీయ కిసాన్ సంఘ్‌ల నుంచి ఒత్తిళ్లు తీవ్రమయ్యాయట. మోదీ విధేయుడిగా ఆ ఒత్తిళ్లను ఎదుర్కోవడం కూడా ఆయనకు పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. అయినా ఎందుకు తప్పుకున్నారు? తనతో ఎలాంటి సంప్రతింపులు జరపకుండానే నీతి ఆయోగ్ సంస్థకు సీఈవోగా అమితాబ్ కాంత్‌ను నియమించడం ఆయనకు నచ్చలేదట. దాంతోపాటు ఆరెస్సెస్ ఒత్తిళ్లు కూడా భరించలేక తప్పుకున్నారని తెలుస్తోంది.