వృద్ధిలో ఈ ఏడాది... చాంపియన్ ఇండియానే!
ప్రపంచ బ్యాంక్ నివేదిక
* వృద్ధిరేటు అంచనా 7.8 శాతం
* వృద్ధి వేగంలో భారత్ తర్వాత చైనా, అమెరికా
ఐక్యరాజ్య సమితి: భారత్ 2016లో కూడా ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని ప్రపంచ బ్యాంక్ తన తాజా నివేదికలో పేర్కొంది. అయితే వృద్ధి రేటును గత జూన్‌లో 7.9 శాతంగా అంచనావేయగా దానిని 7.8 శాతానికి తగ్గించింది. ఈ స్థాయి వృద్ధి రేటును కూడా భారత్‌మినహా ఏ దేశం సాధించలేదని పేర్కొంది. కాగా ప్రపంచం మొత్తంమీద వృద్ధి రేటును జూన్‌లో 3.3 శాతంగా అంచనావేయగా, దానిని తాజాగా 2.9 శాతానికి కుదించింది. నివేదికలోని ముఖ్యాంశాలు...
* భారత్ తరువాత వృద్ధి స్పీడ్‌లో చైనా ఉంది. 2016లో 6.7 శాతం వృద్ధి రేటు నమోదవుతుంది. 2017లో ఈ రేటు 6.5 శాతంగా ఉంటుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 2.7 శాతం వృద్ధి సాధిస్తుంది. వచ్చే రెండేళ్లలో ఈ రేటు వరుసగా 2.4 శాతం, 2.2 శాతంగా ఉంటుంది.
* భారత్ 2017 వృద్ధి రేటు అంచనా 7.9 శాతం. సంస్కరణల వేగం నెమ్మదించినప్పటికీ ఈ స్థాయి వేగం నమోదవుతుంది. అయితే 2018 వృద్ధిరేటు అంచనాను సైతం 8 శాతం నుంచి 7.9 శాతానికి కుదించింది. ఇతర ప్రధాన అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోల్చిచూస్తే... భారత్ చక్కటి పనితీరును ప్రదర్శిస్తోంది. సమీప భవిష్యత్తులో అంతర్జాతీయ ఒడిదుడుకులను తట్టుకునే పరిస్థితి ఉంది. దేశీయ వాణిజ్యం పటిష్టమయ్యే సూచనలు ఉన్నాయి. తగిన పాలసీ నిర్ణయాల రూపకల్పన సామర్థ్యం ఉంది.
* అయితే కొన్ని సవాళ్లూ ఉన్నాయి. ముఖ్యంగా సంస్కరణల విషయంలో ఈ సవాళ్లను ప్రస్తావించుకోవచ్చు. ఎగువ సభలో పాలకపార్టీకి మెజారిటీ లేకపోవడం- సంస్కరణల విషయంలో ముందుకు వెళ్లలేని పరిస్థితిని సృష్టిస్తోంది. వస్తువులు, సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు విషయంలో జరుగుతున్న జాప్యాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు. ఆయా అంశాల ప్రభావం దేశీయ మార్కెట్‌పై కూడా పడుతోంది. భూ సంస్కరణలు నెమ్మదించడం పెట్టుబడుల జాప్యానికి సైతం దారితీస్తోంది. దేశంలో పారిశ్రామిక రంగం మందగమనాన్ని కూడా నివేదిక ప్రస్తావించింది. అయితే ప్రభుత్వ చొరవల కారణంగా పెట్టుబడుల ప్రక్రియ ముఖ్యంగా మౌలిక రంగంలో క్రమంగా పుంజుకుంటోంది.
* దేశంలో మౌలిక రంగం పురోగతికి, పెట్టుబడుల వృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అమెరికా కఠిన ద్రవ్య విధానం ప్రభావం పడే అవకాశం ఉంది.
* అంతర్జాతీయంగా ముడి చమురు ధరల దిగువస్థాయి ధోరణి భారత్ సంస్థలకు ఇంధన వ్యయాలను తగ్గిస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థకు లాభించే అంశం ఇది.
* కరెంట్ అకౌంట్‌లోటు, విదేశీ మారక ద్రవ్య నిల్వలు, నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) రాక వంటి అంశాలు సానుకూలంగా ఉన్నాయి.