షావోమి నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్
⇒ రెడ్‌మి 4ఏ ..ధర రూ.5,999
⇒ భారత్‌లో చౌక ధర షావోమి ఫోన్
⇒ భారత్‌లో షావోమి రెండో ప్లాంట్.. శ్రీ సిటీలో ఏర్పాటు
న్యూఢిల్లీ: చైనా మొబైల్ ఫోన్ కంపెనీ షావోమి కొత్త స్మార్ట్ ఫోన్, రెడ్‌మి 4ఏను మార్కెట్లోకి తెచ్చింది. స్మార్ట్‌ఫోన్ ధర రూ.5,999 అని షావోమి ఇండియా తెలిపింది. భారత్‌లో తమ కంపెనీ అందిస్తున్న చౌక ధర ఫోన్ ఇదేనని షావోమి ఇండియా హెడ్ మను జైన్ పేర్కొన్నారు. ఈ డ్యుయల్ సిమ్ 4జీ ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5 అంగుళాల హెచ్‌డీ డీస్‌ప్లే, 2జీబీ ర్యామ్, 16 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్, , 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్.
3120 ఎంఏహెచ్ బ్యాటరీ, తదితర ఫీచర్లున్నాయని వివరించారు. అమెజాన్ ఇండియా, మిడాట్‌కామ్ వెబ్‌సైట్‌ల ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చని తెలిపారు. ఈ 4జీ ఫోన్ రూ.7,000 ధర ఉన్న స్మార్ట్‌ఫోన్ కేటగిరీలో ఎక్కు వగా అమ్ముడవుతున్న మైక్రోమ్యాక్స్ ఫోన్లకు గట్టిపోటీనివ్వగలదని పరిశ్రమ వర్గాలంటున్నాయి.
శ్రీ సిటీలో ప్లాంట్..
భారత్‌లో రెండో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నామని మను జైన్ పేర్కొన్నారు. ఫాక్స్‌కాన్ భాగస్వామ్యంతో ఈ ప్లాంట్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సిటీలో ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి పెట్టుబడి వివరాలను ఆయన వెల్లడించలేదు. రెండో ప్లాంట్ కూడా పూర్తిగా అందుబాటులోకి వస్తే, భారత్‌లో ఒక సెకన్‌కు ఒక ఫోన్‌ను తయారు చేయగలమని మను జైన్ పేర్కొన్నారు. ఈ రెండు ప్లాంట్లు కలసి 5 వేల మంది వరకూ ఉపాధిని కల్పిస్తాయని, వీరిలో 90 శాతం మంది మహిళలే అని వివరించారు. భారత్‌లో తమ ఫోన్లకు ఉన్న డిమాండ్‌ను ఈ రెండు యూనిట్లు 95 శాతం వరకూ తీర్చగలవని పేర్కొన్నారు.