కాంప్లాన్‌ బాయ్‌.. జైడస్‌! | Zydus to buy Heinz’s India business, including Complan, for Rs4,595 crore | Sakshi
Sakshi News home page

కాంప్లాన్‌ బాయ్‌.. జైడస్‌!

Published Thu, Oct 25 2018 12:46 AM | Last Updated on Thu, Oct 25 2018 12:46 AM

Zydus to buy Heinz’s India business, including Complan, for Rs4,595 crore - Sakshi

న్యూఢిల్లీ: కన్జ్యూమర్‌ ఉత్పత్తుల సంస్థ జైడస్‌ వెల్‌నెస్‌ తాజాగా హెంజ్‌ ఇండియాను కొనుగోలు చేయనుంది. క్యాడిలా హెల్త్‌కేర్‌తో కలిసి ఈ డీల్‌ కుదుర్చుకోనున్నట్లు బుధవారం ప్రకటించింది. ఈ ఒప్పందం విలువ సుమారు రూ. 4,595 కోట్లు. హెంజ్‌ ఇండియా కొనుగోలుతో ఎనర్జీ డ్రింక్‌ గ్లూకోన్‌–డీ, టాల్కం పౌడర్‌ బ్రాండ్‌ నైసిల్, నెయ్యి బ్రాండ్‌ సంప్రీతి మొదలైనవి తమ పోర్ట్‌ఫోలియోలోకి చేరనున్నట్లు జైడస్, క్యాడిలా సంస్థలు విడివిడిగా స్టాక్‌ ఎక్సే్ఛంజీలకు తెలియజేశాయి. అలాగే భారత్, బంగ్లాదేశ్, నేపాల్‌ తదితర దేశాల్లో కాంప్లాన్‌ ఉత్పత్తికి సంబంధించిన మేధో హక్కులు కూడా వీటికి లభిస్తాయి. ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం నాటికి (వచ్చే ఏడాది మార్చి) డీల్‌ పూర్తి కాగలదని ఈ సంస్థలు తెలియజేశాయి. జైడస్‌ వెల్‌నెస్‌లో క్యాడిలా హెల్త్‌కేర్‌కు మెజారిటీ వాటాలున్నాయి. అమెరికన్‌ దిగ్గజం క్రాఫ్ట్‌ హెంజ్‌ భారత విభాగమైన హెంజ్‌ ఇండియాను కొనుగోలు చేసేందుకు టాటా గ్రూప్, డాబర్‌ ఇండియా మొదలైన దిగ్గజాలు పోటీపడ్డాయి. 

‘మా పోర్ట్‌ఫోలియోను విస్తరించడానికి, ఆరోగ్యకరమైన జీవన విధానాలు పాటించే వినియోగదారులు మెచ్చే బ్రాండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడానికి ఈ కొనుగోలు మంచి అవకాశం. కన్జ్యూమర్‌ వెల్‌నెస్‌ విభాగంలో మా కార్యకలాపాలు మరింతగా విస్తరించేందుకు కూడా ఇది తోడ్పడుతుంది‘ అని జైడస్‌ వెల్‌నెస్‌ చైర్మన్‌ శార్విల్‌ పటేల్‌ తెలిపారు. అటు కాంప్లాన్‌ తరహాలోనే అమ్మకానికి ఉన్న హార్లిక్స్‌ బ్రాండ్‌ కొనుగోలు కోసం పోటీపడటం లేదని ఆయన స్పష్టం చేశారు. తమ వ్యాపార వ్యూహాలకు కాంప్లాన్‌ బ్రాండ్‌ మరింత అనువైనదిగా ఆయన చెప్పారు. హెంజ్‌ సాస్‌లు, ఇతరత్రా క్రాఫ్ట్‌ ఉత్పత్తుల విక్రయాలను పెంచుకోవడంపై దృష్టి సారించనున్నట్లు క్రాఫ్ట్‌ హెంజ్‌ వెల్లడించింది.  

రూ. 1,700 కోట్లకు జైడస్‌ ఆదాయాలు.. 
న్యూట్రిషన్‌ పానీయాల్లో చక్కెర శాతం ఎక్కువగా ఉంటోందన్న కారణంతో వినియోగదారులు క్రమంగా ఆయుర్వేద ఉత్పత్తుల వైపు మళ్లుతున్న నేపథ్యంలో దేశీ న్యూట్రిషనల్‌ డ్రింకుల మార్కెట్‌ మందగమనంలో ఉంది. గడిచిన అయిదేళ్లుగా 16.1 శాతం మేర వార్షికంగా వృద్ధి చెందుతున్న ఈ మార్కెట్‌.. 2017– 2022 మధ్య 5.6 శాతమే వృద్ధి సాధించవచ్చన్న అంచనాలున్నాయి. ఈ సమయంలో జైడస్‌ ఈ డీల్‌ కుదుర్చుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. జూన్‌ 30తో ముగిసిన 12 నెలల కాలంలో కాంప్లాన్, గ్లూకోన్‌–డీ, నైసిల్, సంప్రీతి ఘీ ఉత్పత్తుల ద్వారా ఆదాయాలు దాదాపు రూ.1,150 కోట్ల మేర నమోదయ్యాయి. ఈ డీల్‌తో జైడస్‌ వెల్‌నెస్‌ వార్షిక కన్సాలిడేటెడ్‌ ఆదాయం రూ.1,700 కోట్లకు చేరనుంది. రూ.40 కోట్ల నికర నిర్వహణ మూలధనం, రూ.15 కోట్ల నగదు నిల్వలను కలిపి కంపెనీ విలువను మదింపు చేశారు. ఇతరత్రా రుణాలేమీ తమకు బదలాయించడం జరగదని జైడస్‌ తెలిపింది. కొంత రుణం, కొంత ఈక్విటీ రూపంలో డీల్‌కు అవసరమైన నిధులను సమకూర్చుకుంటామని, పలు ప్రైవేట్‌ ఈక్విటీ దిగ్గజాలు తోడ్పాటునివ్వడానికి సిద్ధంగా ఉన్నాయని వివరించింది. 

1994 నుంచి కార్యకలాపాలు 
క్రాఫ్ట్‌ హెంజ్‌ భారత్‌లో 1994 నుంచి కార్యకలాపాలు సాగిస్తోంది. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని అలీగఢ్, ఉత్తరాఖండ్‌లోని సితార్‌గంజ్‌లో ఈ సంస్థకు రెండు తయారీ ప్లాంట్లున్నాయి. ప్రస్తుతం హెంజ్‌ ఇండియాకు 29 రాష్ట్రాల్లో దాదాపు 800 మంది పైగా పంపిణీదారులు, 20,000 పైచిలుకు హోల్‌సేలర్ల నెట్‌వర్క్‌ ఉంది. మరోవైపు జైడస్‌ వెల్‌నెస్‌కు షుగర్‌ ఫ్రీ, ఎవర్‌యూత్, న్యూట్రాలైట్‌ తదితర ప్రధానమైన బ్రాండ్స్‌ ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement