సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన ఓ జిల్లాకు ఆయన ఎస్పీ. అక్రమార్కుల భరతం పట్టాల్సిన ఆయనే అక్రమార్జనకు తెరలేపాడు. కరీంనగర్ రేంజ్‌లోని ఆ ఎస్పీ వ్యవహారం ఇప్పుడు పోలీస్ శాఖలో హాట్‌టాపిక్‌గా మారింది. జిల్లాలో ఉన్న ప్రతీ పోలీస్‌స్టేషన్‌కు టార్గెట్ పెట్టి వసూళ్లు చేయడం, కేసుకు ఇంత, సెటిల్‌మెంట్‌కు ఇంత అంటూ రేటు ఫిక్స్ చేసి మరీ దందాలు చేయడం ఈయన ప్రత్యేకత. ఈ వ్యవహారాలన్నీ డీజీపీ దృష్టికి వచ్చినట్టు చర్చ జరుగుతోంది. దీంతో సదరు ఎస్పీపై ఇంటెలిజెన్స్ విచారణ జరుగుతున్నట్టు పోలీస్ శాఖ వర్గాలు తెలిపాయి.
గెస్ట్‌హౌస్‌ల్లో చీకటి దందా
ఈ ఎస్పీ పనిచేస్తున్న జిల్లాలో రెండు ప్రముఖ పుణ్యక్షేత్రాలున్నాయి. ఈ రెండుచోట్లా రెండు గెస్ట్‌హౌస్‌లతోపాటు ఫైనాన్స్, బిజినెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న ఓ రెవెన్యూ డివిజన్ మరో గెస్ట్‌హౌస్‌ను కేంద్రంగా చేసుకొని చీకటి దందాలు నడుపుతున్నాడు. వారానికోసారి ఈ మూడు గెస్ట్‌హౌస్‌లకు వెళ్లడం, దూతలుగా నియమించుకున్న ప్రైవేట్ వ్యక్తులతో సెటిల్‌మెంట్లు, దందాలకు సంబంధించి వచ్చిన వసూళ్లతో బ్యాగ్ నింపుకోవడం చేస్తున్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. అంతేకాదు గెస్ట్‌హౌస్‌లను అసాంఘిక కార్యకలాపాలకు కూడా ఉపయోగించు కున్నట్టు నిఘా వర్గాల విచారణలో బయటపడింది. దీంతో ఎస్పీ వ్యవహారంపై ఉన్నతాధికారులు ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎలాగూ రాష్ట్రంలో ఎస్పీ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారులు తక్కువగా ఉన్నారు కాబట్టి తనను బదిలీ చేసే అవకాశమే లేదని ఆయన రెచ్చిపోతున్నారని తెలుస్తోంది.
ఆరు నెలల డబ్బుల హాంఫట్!
పోలీస్ శాఖలో అవినీతి నియంత్రణ, అత్యుత్తమ సేవల కోసం పోలీస్‌స్టేషన్ల మెయింటెన్స్ ఖర్చుకు ప్రభుత్వమే ప్రతీ నెల గ్రేడ్ల వారీగా నిధులు కేటాయిస్తోంది. అయితే ఈ జిల్లాలో ఆరు నెలల నుంచి ఒక్క పోలీస్‌స్టేషన్‌కు మెయింటెన్స్ డబ్బులు రాకపోవడంపై సిబ్బందిలో చర్చ జరిగింది. దీనిపై అధికారులు రేంజ్, జోన్ కార్యాలయాల్లో ఆరా తీయగా.. ఆ డబ్బంతా ఎస్పీ అకౌంట్‌కు చేరుతున్నట్టు గుర్తించారు. ఇలా ఆరు నెలలకు సంబంధించి రూ.16 లక్షల సొమ్మును ఎస్పీ హాంఫట్ చేసినట్టు జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు, సిబ్బంది చర్చించుకుంటున్నారు.
మూడు నెలలకోసారి బెదిరింపులు
ఎవరైనా అధికారులు, సిబ్బంది తనకు నెల మామూళ్లు ఆపేసినా, పట్టించుకోకుండా వ్యవహరించినా ఎస్పీ తన దూతలను పంపించి గెస్ట్‌హౌస్‌లో క్లాస్ పీకిస్తారు. ‘మీపై ఎస్పీ చాలా సీరియస్‌గా ఉన్నారు. సార్‌ను పట్టించుకోవడం లేదంటా. ఇలా అయితే కష్టం. మింమ్మల్ని బదిలీ చేయించడమా లేదా పనిష్‌మెంట్ కింద చర్యలు తీసుకోవడమో చేస్తారట’ అంటూ ఆ దూతలు ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలను బెదిరించినట్టు నిఘా వర్గాలు ఉన్నతాధికారులకు నివేదించాయి. ఇలా ప్రతీ మూడు నెలలకోసారి అధికారుల నుంచి తనకు కావాల్సిన డబ్బులు, గిఫ్టులు, బంగారు కానుకలు తీసుకోవడం ఈ ఎస్పీకి ఆనవాయితీగా మారిందని నిఘా వర్గాలు తమ నివేదికలో ఉన్నతాధికారులకు స్పష్టంచేశాయి. గతంలో కూడా ఈ అధికారి ఓ మహిళా డాక్టర్ పట్ల వ్యవహరించిన తీరు రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపింది.
ఎమ్మెల్యేలకే ఉల్టా వార్నింగ్
గెస్ట్‌హౌస్‌ల వ్యవహారం, అందులో అసాంఘిక కార్యకలాపాలపై జిల్లా పరిధిలోని ఇద్దరు ఎమ్మెల్యేలు(ఇందులో ఒకరికి కేబినెట్ హోదా ఉంది) సదరు ఎస్పీకి రెండు నెలల కిందట వార్నింగ్ ఇచ్చారు. కొత్తగా ఏర్పడిన జిల్లాలో ఇలాంటి వ్యవహారాలతో అటు జిల్లాకు, ఇటు ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని, దందాలు మానుకోవాలని హెచ్చరించినట్టు తెలిసింది. అయితే తాను ఎంపీ మనిషినని తనను ఎవరూ ఏం చేయలేరని ఎస్పీ వారికే ఉల్టా వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. దీంతో ఆ ఎమ్మెల్యేలు ఎస్పీపై సంబంధిత ఎంపీకి కూడా ఫిర్యాదు చేశారు.