
సాక్షి, భువనేశ్వర్ : సామూహిక లైంగిక దాడికి గురైన మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటనతో ఒడిషా అట్టుడికింది. ఈ ఉదంతంపై కాంగ్రెస్, బీజేపీ బుధవారం రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపు ఇవ్వడంతో ఉద్రిక్తత నెలకొంది. పలు ప్రాంతాల్లో కార్యకర్తలు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనపై సీబీఐ విచారణకు విపక్షాలు డిమాండ్ చేశాయి. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఆందోళనకు దిగిన బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
గత ఏడాది అక్టోబర్ 10న కోరాపుట్ జిల్లాలోని ముసగడ గ్రామంలో ఇంటికి వెళుతున్న బాలికను అటకాయించిన నలుగురు వ్యక్తులు ఆమెపై సామూహిక లైంగిక దాడికి తెగబడ్డారు. నిందితుల నుంచి తనకు ప్రాణహాని ఉందని బాలిక పలు సందర్భాల్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో మంగళవారం ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు. మరోవైపు బాధితురాలి మృతి ప్రభుత్వ వైఫల్యమని బీజేపీ, కాంగ్రెస్‌లు ఆరోపిస్తున్నాయి. ఘటనకు నిరసనగా సీఎం నవీన్ పట్నాయక్ నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించాయి.