న్యూఢిల్లీ: దేశరాజధానిలో దారుణం చోటుచేసుకుంది. ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఉంటున్న ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆదివారం అనుమానాస్పదరీతిలో చనిపోయారు. మృతుల్లో ఏడుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. ఈ విషయమై ఢిల్లీ అదనపు డీసీపీ వినీత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ..కుటుంబ సభ్యుల్లో 10 మంది ఇంట్లోని సీలింగ్‌కు ఉన్న ఇనుప కమ్మీలకు వేలాడుతుండగా, మరో వృద్ధురాలు(75) నేలపై చనిపోయి ఉందని తెలిపారు. అలాగే వీరి నోటికి టేప్ అంటించారన్నారు.
పోలీసుల తనిఖీల్లో ఈ ఇంట్లో తాంత్రిక పూజలకు సంబంధించి చేతిరాతతో ఉన్న పేపర్లు లభ్యమయ్యాయని పేర్కొన్నారు. ఈ పత్రాలను బట్టి కుటుంబం మొత్తం తాంత్రిక పూజల్లో పాల్గొనేదని తెలుస్తోందన్నారు. ఈ కాగితాల్లో ఉన్నట్లుగానే కుటుంబ సభ్యుల్ని చేతులకు కట్లు, కళ్లకు గంతలు కట్టారన్నారు. అంతేకాకుండా అరవకుండా నోటికి టేప్‌ను అంటించారన్నారు. కుటుంబసభ్యుల్లో తాంత్రిక శక్తులతో ప్రభావితమైన ఒకరు మిగిలిన 10 మందిని హత్యచేసి తానూ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నామని కుమార్ తెలిపారు.
తొలుత నిందితుడు అందరికీ భోజనంలో మత్తుమందు కలిపి ఇచ్చి స్పృహ కోల్పోయాక వారందర్నీ ఉరితీసి ఉంటాడని వెల్లడించారు. ఈ సందర్భంగా కుటుంబంలోని వృద్ధురాలు స్పృహలోకి రావడంతో ఆమెను సదరు వ్యక్తి గొంతుకోసి చంపాడన్నారు. ఈ కేసును ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేసినట్లు వెల్లడించారు. మృతుల్ని నారాయణ్ దేవీ భాటియా(75) ఆమె కుమార్తెలు ప్రతిభ(60), మనవరాలు ప్రియాంక(30)లతో పాటు నారాయణ్ దేవీ పెద్ద కుమారుడు భూపీ భాటియా(46) అతని భార్య సవిత(42), సవిత ముగ్గురు పిల్లలు, చిన్నకుమారుడు లలిత్(42), అతని భార్య టీనా(38)గా గుర్తించామన్నారు.
వీరిలో ప్రియాంకకు ఇటీవలే నిశ్చితార్థం జరిగిందనీ, ఈ ఏడాది చివరల్లో వివాహం జరగనుందని వెల్లడించారు. ప్రస్తుతం మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించామన్నారు. ఈ కుటుంబాన్ని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా? అన్న కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోందని కుమార్ పేర్కొన్నారు. రోజూ ఉదయాన్నే షాపును తెరిచే కుటుంబం ఉదయం 7.30 గంటలైనా బయటకు రాకపోవడంతో పొరుగున ఉండే అమ్రిక్ సింగ్ ఇంట్లోకి వెళ్లాడన్నారు. ఘటనాస్థలాన్ని చూసి దిగ్భ్రాంతి చెందిన అతను వెంటనే పోలీసులకు సమాచారం అందించాడన్నారు. సంత్‌నగర్‌లో ఉన్న రెండంతస్తుల సొంతింటిలో బాధిత కుటుంబం గత 20 ఏళ్లుగా నివసిస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కేసు విషయమై పోలీసులతో మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment