శ్రీనగర్: కొత్త ఏడాది ఆరంభానికి కొద్ది గంటల ముందు జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో సంచలన విషయం వెలుగు చూసింది. జమ్మూ కశ్మీర్ రాష్ట్రం పుల్వామా జిల్లా లెత్‌పొరాలోని సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) క్యాంప్‌పై జైష్ – ఎ – మహ్మద్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 16 ఏళ్ల బాలుడు ఉన్నట్టు గుర్తించారు. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో అతడు మృతి చెందాడు.
పోలీసు కానిస్టేబుల్ గులాం మహ్మద్ ఖాండే కుమారుడైన ఫర్దీన్ అహ్మద్ ఖాండే మూడు నెలల క్రితం ఉగ్రవాదిగా మారాడని కశ్మీర్ పోలీసులు తెలిపారు. బుర్హాన్ వనీ స్వస్థలం త్రాల్‌కు చెందిన ఫర్దీన్ పదో తరగతి చదివాడు. ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో అతడితో పాటు మన్‌జూర్ బాబా డ్రబ్‌గామ్(22) కూడా హతమయ్యాడు. మరో ఉగ్రవాది కూడా మరణించి ఉంటాడని, అతని మృతదేహం కోసం క్యాంప్‌లో గాలిస్తున్నామని సీఆర్పీఎఫ్ అధికార ప్రతినిధి రాజేశ్ యాదవ్ తెలిపారు. చిన్నపిల్లలు ఉగ్రవాదం పట్ల ఆకర్షితులు కావడం కశ్మీర్ పోలీసులను ఆందోళనకు గురిచేస్తోంది.
దాడికి ముందు వీడియో
మిలటరీ క్యాంప్‌పై దాడికి ముందు ఫర్దీన్ రికార్డు చేసిన ఎనిమిది నిమిషాల వీడియో మెసేజ్ వాట్సప్‌లో వైరల్‌గా మారింది. సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై వ్యూహం పన్నినట్టు వీడియో మెసేజ్‌లో ఫర్దీన్ వెల్లడించాడు. ‘ఈ సందేశం మీకు చేరేటప్పటికీ నేను స్వర్గంలో దేవుడి దగ్గర అతిథిగా ఉంటాన’ని వీడియోలో పేర్కొన్నాడు. ఆదివారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు జవాన్లు అమరులు కాగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment