జైపూర్ : 14 ఏళ్ల బాలికను రూ. 1.5 లక్షలకు అమ్మేశారు.. ఇప్పుడామె రెండు నెలల గర్భిణి. తనను బంధించిన వ్యక్తి నుంచి తప్పించుకుని వెళ్లిపోయింది. కానీ అతనే తన భార్య అదృశ్యమైందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అసలు విషయం బయటపడింది. వివరాలు.. త్రిపుర ఉన్నకోటికి చెందిన 14 ఏళ్ల బాలికను జైపూర్ వాసి రాజుకు రూ. 1.5 లక్షలకు అమ్మేశారు. కాగా రాజు తన భార్య అదృశ్యమైందంటూ మే 2వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మే 4వ తేదీన తప్పిపోయిన అమ్మాయి ఆచూకీని పోలీసులు కనుగొన్నారు.
అయితే రాజు వెంట వెళ్లేందుకు ఆమె ఇష్టపడలేదు. దీంతో ఆ అమ్మాయిని షెల్టర్ హోంకు తరలించారు. తనకు జరిగిన అన్యాయంపై సదరు బాలిక షెల్టర్ హోం అధికారులకు తెలియజేసింది. అయితే ఆమె పేరు, వివరాలపై అధికారులకు అనుమానం కలిగింది. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని ఉన్నతాధికారులు పోలీసులను ఆదేశించారు. పోలీసులు బాలికను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ప్రవేశపెట్టారు. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. కాగా బాలిక చెప్పిన వివరాలు నిజమా కాదా అన్నదానిపై ఉన్నకోటి పోలీసులను ఆశ్రయించారు. అయితే బాలిక చెప్పిన సమాచారం నిజమేనని ఉన్నకోటి పోలీసులు తేల్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment