
సాక్షి, ముజఫర్‌నగర్ : ఉత్తరప్రదేశ్‌లో నేరస్తులు జైళ్లలో ఎంజాయ్ చేస్తున్నారు. ఏం చక్కా ఫోన్‌లు మాట్లాడుకుంటూ వాటిల్లోనే సెటిల్‌మెంట్‌లు చేసుకుంటూ, దర్జాగా ఫొటోలు దిగుతూ తమకే దిగులు లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఆ విషయం కాస్త బయటకు పొక్కడంతో ఇప్పుడు తీవ్రస్థాయిలో జైలు శాఖ అధికారులకు తలనొప్పిగా మారింది.
ఇంతకు వారు ఏం చేశారో తెలుసా.. ముజఫర్‌నగర్ జైలులో ఉన్న ఓ ముగ్గురు ఖైదీలు ఏకంగా జైలు సెల్ఫీలు దిగి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. వీరు ముగ్గురిపై కూడా హత్య కేసులు, హత్యాయత్నం కేసులు ఉన్నాయి. అయితే, జైలులో ఖైదీల వద్ద ఎలాంటి సెల్‌ఫోన్లు ఉండొద్దని నిబంధన ఉన్న విషయం తెలిసిందే. కానీ, వాటన్నింటిని ఖాతరు చేయకుండా వారు విచ్చలవిడిగా ఫోన్లు వాడటం, వారు వాడుతున్న విషయాన్ని ఇలా బాహటంగా బయటపెట్టడంతో అధికారులు చిక్కుల్లో పడ్డారు. ప్రస్తుతం ఆ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు వారిపై అదనంగా కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.