వెంటాడి...వేటాడారు! | 32 people including Whats Aap group admins was arrested in | Sakshi
Sakshi News home page

వెంటాడి...వేటాడారు!

Published Mon, Jul 16 2018 1:23 AM | Last Updated on Fri, Jul 27 2018 1:16 PM

32 people including Whats Aap group admins was arrested in  - Sakshi

హైదరాబాదీలపై దాడి చేస్తున్న గ్రామస్తులు(ఫైల్‌)

సాక్షి, హైదరాబాద్‌: కర్ణాటకలోని బీదర్‌లో నలుగురు హైదరాబాదీలను పిల్లల కిడ్నాపర్లుగా పొరబడి స్థానికులు చేసిన దాడిలో ఒకరు మృతిచెందడం వెనుక వాట్సాప్‌లో వ్యాపించిన వదంతులే కారణమని తేలింది. ఓసారి దాడి నుంచి తృటిలో తప్పించుకున్నా హైదరాబాదీలు ప్రయాణించిన కారుతోపాటు అందులోని వారి ఫొటోలను కిడ్నాపర్లుగా పేర్కొంటూ వాట్సాప్‌ గ్రూపులో షేర్‌ చేయడంతో మరో చోట దారికాచిన స్థానికులు వారిని చావబాదినట్లు వెల్లడైంది. ఈ కేసుకు సంబంధించి 30 మంది గ్రామస్తులతోపాటు వదంతులను వాట్సాప్‌లో పోస్టు చేసిన గ్రూపు అడ్మిన్‌ మనోజ్‌ కుమార్, ఫొటోలు షేర్‌ చేసిన గ్రూపు సభ్యుడు అమర్‌ పాటిల్‌లనూ అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నట్లు బీదర్‌ ఎస్పీ డి.దేవ్‌రాజ్‌ వెల్లడించారు. ఈ దాడిలో గాయపడిన ముగ్గురు నగరవాసులను చికిత్స అనంతరం ఆదివారం డిశ్చార్జి చేశారు. 

దాడి జరిగిందిలా... 
ఈ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబాలు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్‌ పహాడీ షరీఫ్‌ పరిధిలోని ఎర్రకుంట, షహీన్‌ నగర్, బార్కస్‌ ప్రాంతాలకు చెందిన మహ్మద్‌ ఆజం, నూర్‌ మహ్మద్, మహ్మద్‌ సల్మాన్‌ బంధువులు. వీరి స్నేహితుడు, ఖతార్‌లో పనిచేసే సల్‌హామ్‌–ఈది–అల్‌–కుబసీ ఇటీవల నగరానికి వచ్చాడు. వీరిందరి స్నేహితుడైన బషీర్‌ బీదర్‌ సమీపంలోని హండికర గ్రామంలో ఉంటాడు. దీంతో అతన్ని కలిసేందుకు నలుగురూ కలసి కారులో శుక్రవారం అక్కడకు వెళ్లారు. మధ్యాహ్న భోజనాలు అనంతరం నలుగురూ తిరుగు ప్రయాణమయ్యారు. వాహనం థౌల్‌ గ్రామ శివార్లకు చేరుకున్నప్పుడు కొందరు స్కూలు విద్యార్థులు తారసపడ్డారు.

వారిని చూసి ముచ్చటపడిన సల్‌హామ్, ఇతర స్నేహితులు కారు ఆపి ఆ చిన్నారులకు చాక్లెట్లు ఇచ్చే ప్రయ త్నం చేశారు. కర్ణాటకలో కొన్ని నెలలుగా కిడ్నాపర్ల వదంతులు వ్యాపిస్తుండటం, ఇదే కారణంతో మే 23న బెంగళూరు శివార్లలో ఓ వ్యక్తిని కొందరు కొట్టి చంపడంతో అపరిచితుల నుంచి చాక్లెట్లు సహా ఎలాంటి వస్తువులూ తీసుకోవద్దని ప్రజలు  చిన్నారులకు నూరిపోస్తున్నారు. దీంతో సల్‌హామ్, అతని స్నేహితులు ఇచ్చిన విదేశీ చాక్లెట్లను ఆ చిన్నారులు తీసుకోకుండా పారిపోతుండగా ఓ చిన్నారిని బలవంతంగా ఆపిన హైదరాబాదీలు.... ఆమె చేతిలో చాక్లెట్లు పెట్టే ప్రయత్నం చేయగా ఆమె పెద్దపెట్టున ఏడ్చింది. ఇది గమనించిన స్థానికులు వారిని కిడ్నాపర్లుగా భావించి పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇది గమనించిన హైదరాబాదీలు స్థానికులకు చిక్కకుండా తప్పించుకున్నారు. 

దారి కాచి దాడి..
వాహనంతోపాటు అందులోని వ్యక్తుల్ని థౌల్‌ గ్రామస్తులు ఫొటోలు తీశారు. వాటిని మనోజ్‌ కుమార్‌ అనే స్థానికుడు అడ్మిన్‌గా ఉండి క్రియేట్‌ చేసిన వాట్సాప్‌ గ్రూప్‌లోకి షేర్‌ చేసిన అమర్‌ పాటిల్‌ అనే వ్యక్తి... వారు కిడ్నాపర్లని, తమ గ్రామం నుంచి తప్పించుకుని ఫలానా దిశలో వస్తున్నారంటూ పోస్ట్‌ చేశాడు. ఇదే గ్రూప్‌లో ఉన్న ముర్కీ గ్రామస్తులు వాట్సాప్‌ సందేశాలతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు. కిడ్నాపర్లు తమ గ్రామం మీదుగానే పారి పోతారని గమనించి రహదారికి అడ్డంగా రాళ్లు, దిమ్మెలు పెట్టారు. అదే సమయంలో అటుగా వాహనం రావడంతో దాదాపు 300 మంది గ్రామస్తులు వారిపై విరుచుకుపడ్డారు. వాహనాన్ని బోల్తా పడేసి ధ్వంసం చేయడంతోపాటు అందులోని ముగ్గురిపై రాళ్లు, కర్రలు, మారణాయుధాలతో దాడి చేశారు.

విషయం తెలుసుకుని ఘటనాస్థలికి చేరుకున్న స్థానిక పోలీసుల్నీ గ్రామస్తులు వదిలిపెట్టలేదు. ఓ ఇన్‌స్పెక్టర్, మరో కానిస్టేబుల్‌కు గాయాలు కావడంతో పోలీసులు లాఠీచార్జ్‌ చేసి స్థానికుల్ని చెదరగొట్టారు. క్షతగాత్రులు నలుగురినీ బీదర్‌ సమీపంలోని అమృద్‌లో ఉన్న ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆజం మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో మిగిలిన ముగ్గురినీ హైదరాబాద్‌లోని మలక్‌పేటలో ఉన్న ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఎర్రగుంట శ్మశానవాటికలో శనివారం ఆజం అంత్యక్రియలు జరిగాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement