సాక్షి, హైదరాబాద్ : సొంత డబ్బులనే ఇతర వ్యాపారుల ఖాతాల్లోకి మళ్లించారు.. వారు తమ వద్ద బంగారం కొన్నట్టు రికార్డుల్లో చూపారు.. తర్వాత వ్యాపారుల నుంచి ఆ సొమ్మునంతా రప్పించుకున్నారు.. ‘బ్లాక్’ను వైట్ చేయడంలో సహకరించినందుకు ఆ వ్యాపారులకు 30 శాతం కమీషన్ ముట్టజెప్పారు! పదులు.. వందల్లో కాదు.. గంటల వ్యవధిలోనే 5 వేల మంది తమ దుకాణాలకు వచ్చి ఏకంగా 340 కిలోల బంగారం కొన్నట్టు చూపి నకిలీ బిల్లులు సృష్టించారు. ఆ కస్టమర్లలో కొందరిని పోలీసులు ఆరా తీస్తే తాము అసలు ఆ దుకాణానికే వెళ్లలేదని చెప్పారు! పెద్దనోట్ల రద్దు తర్వాత హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన ముసద్దీలాల్ కేసులో లీలలివీ!!
రూ.97.85 కోట్లకు సంబంధించిన ఈ స్కామ్‌లో పక్కా ఆధారాలు సేకరించిన నగర నేర పరిశోధన విభాగం(సీసీఎస్) అభియోపత్రాలు దాఖలు చేసింది. కేసులో మొత్తం పది మంది నిందితులతో పాటు మూడు కంపెనీలపై చార్జిషీట్ దాఖలు చేసినట్లు సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి బుధవారం వెల్లడించారు. రూ.97.85 కోట్ల నగదు మొత్తం ముసద్దీలాల్ యాజమాన్యానికి చెందినదే అని నిర్ధారణ అయినట్లు స్పష్టంచేశారు.
రాత్రి 9 నుంచి 12 గంటల మధ్య..
గతేడాది నవంబర్ 8న పెద్దనోట్ల రద్దు ప్రకటన వెలువడింది. ఊహించని ఈ పరిణామంతో కంగుతిన్న ముసద్దీలాల్ యాజమాన్యం తమ వద్ద ఉన్న నల్లధనాన్ని మార్చుకోవడానికి భారీ కుట్ర చేసింది. తమ ప్రధాన సంస్థ ముసద్దీలాల్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దీని అనుబంధ సంస్థలు ముసద్దీలాల్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్, వైష్ణవి బులియన్ ప్రైవేట్ లిమిటెడ్‌ల కేంద్రంగా బంగారం ‘విక్రయాలకు’స్కెచ్ రెడీ చేసింది. ఆ రోజు రాత్రి 9 నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్య మొత్తం 5,200 మంది వినియోగదారులు రూ.97.85 కోట్ల విలువైన 340 కేజీల బంగారం ఖరీదు చేసినట్లు బోగస్ అడ్వాన్స్ పేమెంట్ రశీదులు సృష్టించారు. ఆ మొత్తాన్ని పంజాగుట్టలోని ఎస్‌బీఐ, బంజారాహిల్స్‌లోని యాక్సిస్ బ్యాంక్‌ల్లో డిపాజిట్ చేశారు. ఈ లావాదేవీలపై అనుమానం వచ్చిన ఆదాయపు పన్ను శాఖ అధికారుల సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
ఒక్కొక్కరు రూ.1.89 లక్షల బంగారం కొన్నారట!
ముసద్దీలాల్ యాజమాన్యం రూపొందించిన బోగస్ బిల్లుల ప్రకారం... నవంబర్ 8 రాత్రి వచ్చిన ఒక్కో వినియోగదారుడు రూ.1.89 లక్షల విలువైన బంగారం కొన్నారు. ఈ రశీదులతో పాటు కస్టమర్లకు సంబంధించినవని పేర్కొంటూ యాజమాన్యం ఆధార్ కార్డు వంటి కొన్ని ధ్రువీకరణలను సైతం జత చేసింది. ఆ గుర్తింపు పత్రాల ఆధారంగా సంబంధీకుల్ని సీసీఎస్ పోలీసులు పిలిచి విచారించారు. ఇందులో ఆ బిల్లులన్నీ నకిలీవని స్పష్టమైంది. ఓ అడ్వాన్స్ పేమెంట్ రశీదుతోపాటు గుర్తింపు కార్డు ఆధారంగా ఓ మహిళను విచారించారు. తాను నెలకు రూ.15 వేల జీతానికి ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్నానని, నోట్ల రద్దు ప్రకటన వెలువడిన రోజు తన వద్ద కేవలం రెండు రూ.500 నోట్లు మాత్రమే ఉన్నాయని చెప్పింది. ఆ రోజు ఆ జ్యువెలరీ సంస్థల్లో బంగారం కొనలేదని స్పష్టం చేసింది. అనేక మంది నుంచి కూడా ఇలాంటి సమాధానమే వచ్చింది. దీంతో ముసద్దీలాల్ సంస్థల వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో నవంబర్ 8న రికార్డు అయిన ఫీడ్‌ను విశ్లేషించారు. ఆ రోజు ఈ సంస్థలకు కేవలం 67 మంది వినియోగదారులు మాత్రమే వచ్చినట్లు వెల్లడైంది. బిల్లులు సృష్టించిన కంప్యూటర్‌ను సీజ్ చేసిన అధికారులు దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. దీన్ని విశ్లేషించిన నిపుణులు ఆ బిల్లులన్నీ నవంబర్ 8 తర్వాత నమోదు చేసినవిగా నిర్ధారిస్తూ నివేదిక ఇచ్చారు.
అరెస్టు తప్పించుకునేందుకు యత్నాలు
సీసీఎస్ పోలీసుల దర్యాప్తు నేపథ్యంలో అరెస్టు నుంచి తప్పించుకోవడానికి ముసద్దీలాల్ యాజమాన్యం అనేక ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) రికార్డులను సైతం తారుమారు చేసింది. ముసద్దీలాల్ సంస్థలకు కైలాశ్ చంద్ గుప్తా, ఆయన కుమారులు నితిన్ గుప్తా, నిఖిల్ గుప్తా, కోడలు నేహ గుప్తా తదితరులు డైరెక్టర్లుగా ఉన్నారు. అరెస్టు నుంచి తప్పించుకోవడానికి ఈ డైరెక్టర్ల పేర్లు మారుస్తూ రికార్డులు సృష్టించారు.
వారి డబ్బునే పంచేసి..
బ్లాక్‌మనీని వ్యాపారం మార్గంలో డిపాజిట్ చేసేందుకు ముసద్దీలాల్ యాజమాన్యం ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు సైతం తెరిచినట్లు దర్యాప్తు అధికారులు నిర్ధారించారు. సీసీఎస్ అధికారులు ముసద్దీలాల్ సంస్థలు, యాజమాన్యాలకు చెందిన బ్యాంకు ఖాతాల్లో ఆయా రోజుల్లో జరిగిన డిపాజిట్లు, మళ్లింపులపై దృష్టి పెట్టారు. నగరంలోని కొందరు బంగారం వ్యాపారులకు ఈ ‘మార్పిడి’లో పాత్ర ఉన్నట్లు తేల్చారు. నగదును ఆయా బంగారం వ్యాపారులు ఖాతాల్లోకి మళ్లించిన ముసద్దీలాల్ యాజమాన్యం.. వారు తమ వద్ద బంగారం కొన్నట్టు రికార్డులు సృష్టించింది. తర్వాత ఆ మొత్తాన్ని మళ్లీ తమ ఖాతాల్లోకి తెప్పించుకున్నట్టు దర్యాప్తులో తేలింది. ఇందుకు సహకరించినందుకు వ్యాపారులకు 10 నుంచి 30 శాతం వరకు కమీషన్ ఇచ్చినట్లు గుర్తించారు. ఈ క్రయ విక్రయాలకు సంబంధించి ఎలాంటి డెలివరీ, రిసీవ్డ్ రశీదులు లేవని నిర్ధారించారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన కైలాశ్ చంద్ గుప్తా, నితిన్ గుప్తా, నిఖిల్ గుప్తా, మరో ఏడుగురితో కలిపి మొత్తం 10 మందిపై అధికారులు అభియోగాలు మోపారు. ముసద్దీలాల్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దీని అనుబంధ సంస్థలు ముసద్దీలాల్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్, వైష్ణవి బులియన్ ప్రైవేట్ లిమిటెడ్‌లపై అభియోగాలు మోపారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఇప్పటికే సీసీఎస్ పోలీసులు ముసద్దీలాల్ సంస్థల ఖాతాల్లో ఉన్న రూ.12 కోట్లను స్తంభింపచేశారు. ఇది మనీ లాండరింగ్‌కు సంబంధించిన వ్యవహారం కావడంతో అధికారులు ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు సమాచారం ఇచ్చారు. చార్జ్‌షీట్ కూడా దాఖలు కావడంతో దాని ఆధారంగా ఈడీ అధికారులు ముందుకు వెళ్లనున్నారు. ఇందులో భాగంగా ఆస్తుల ఎటాచ్‌మెంట్ కూడా ఉంటుందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment