ఏఈ వెంకటరెడ్డి(సర్కిల్‌లోఉన్నవ్యక్తి)ని విచారిస్తున్న ఏసీబీ అధికారులు
యర్రగొండపాలెం: పుల్లలచెరువు మండలంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈగా పనిచేస్తున్న బి.వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు బుధవారం వలపన్ని పట్టుకున్నారు. ఒకరి నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుపడ్డారు. వేసిన బోరుకు బిల్లులు చేయకుండా డబ్బులకోసం వేధింపులకు గురిచేస్తుండటంతో పుల్లలచెరువు ఎస్సీపాలెంకు చెందిన లింగంగుంట్ల మరియదాసు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు ఏసీబీ ఒంగోలు డీఎస్పీ తోట ప్రభాకర్ ఆధ్వర్యంలో సిబ్బంది యర్రగొండపాలెం పట్టణంలోని ఎన్జీఓస్ కాలనీలోని వెంకటరెడ్డి నివాస గృహంపై దాడులు నిర్వహించారు. ముందుగా స్థానిక మార్కాపురం రోడ్డులోని ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయంవద్ద రెక్కీ నిర్వహించారు. అక్కడ ఏఈ లేకపోవడంతో ఫిర్యాదుదారునితో ఫోనులో మాట్లాడించి ఇంటివద్దకు వెళ్లారు. ఫిర్యాదుదారుడు ఏసీబీ అధికారులు ఇచ్చిన రూ. 10 వేల నోట్లను తీసుకొనివెళ్లి ఏఈకి ఇచ్చాడు. వెంటనే ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి ఆయన్ను పట్టుకున్నారు.
ఏం జరిగింది?
గత సంవత్సరం ఏప్రిల్‌లో ఎంపీ నిధుల కింద బోరుకు రూ. 1.25 లక్షలు మంజూరయ్యాయి. ఈ బోరును పుల్లలచెరువు ఎస్సీ పాలెంలో మేనెలలో వేసిన మరియదాసు పంచాయతీకి స్వాధీనం చేశాడు. కాగా ఏఈ చెక్ మెజర్ చేయడం, సెప్టెంబరునెలలో క్వాలిటీ కంట్రోల్ పరిశీలించడం జరిగాయని డీఎస్పీ ప్రభాకర్ తెలిపాడు. అయితే ఏఈ పర్సెంటేజీల కోసం బిల్లులు చేయకుండా ఆపివేశాడని, క్వాలిటీ కంట్రోల్ ఫైల్ కూడా ఉన్నతాధికారులకు పంపకుండా తనవద్దనే ఉంచుకున్నాడని తెలిపారు. మరియదాసు అధికారిచుట్టూ తిరగినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆయన ఏసీబీని ఆశ్రయించాడని డీఎస్పీ తెలిపారు. ఇంజినీరింగ్‌శాఖ అధికారులపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ఇప్పటికైన అధికారులు తమ వ్యవహారశైలిని మార్చుకొని ప్రజలను ఇబ్బందులు పెట్టకుండా ఉండాలని హెచ్చరించారు. తగిన ఆధారాలతో బాధితులు ఏసీబీని ఆశ్రయించవచ్చని వివరించారు. దాడుల్లో ఏసీబీ సర్కిల్‌ఇన్‌స్పెక్టర్ టీవీవీ ప్రతాప్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment