డీటీ కిరణ్‌కుమార్‌ను విచారిస్తున్న ఏసీబీ అధికారులు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న డబ్బులు
చిట్యాల(భూపాలపల్లి): ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల తహసీల్దార్ కార్యాలయంలో రెండేళ్లలో తహసీల్దార్ పాల్‌సింగ్, వీఆర్వో రవీందర్ ఏసీబీ అధికారులకు పట్టుపడగా, శుక్రవారం డిప్యూటీ తహసీల్దార్ రామగిరి కిరణ్‌కుమార్ రూ.5వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ కిరణ్‌కుమార్ కథనం ప్రకారం... చిట్యాల మండలం నవాబుపేట గ్రామానికి చెందిన రేషన్ డీలర్ ముకిరాల శ్యామలకు పభుత్వం నుంచి రూ.40 వేల కమీషన్ విడుదలైంది. శ్యామలను అత్తగారింటి వద్ద విజయలక్ష్మి అని పిలుస్తుంటారు.
ఈమేరకు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు విజయలక్ష్మి పేరుమీదే ఉన్నాయి. ఆమె పేర కమీషన్ డబ్బు మంజూరు కాగా కుమారుడు మధువంశీకృష్ణ 45 రోజుల క్రితం డిప్యూటీ తహసీల్దార్ కిరణ్‌కుమార్‌ను సంప్రదించి శ్యామలగా ధ్రువీకరించి చెక్కు ఇవ్వాలని కోరాడు. ఇందుకు డీటీ రూ.10 వేలు లంచం డిమాండ్ చేశాడు. తమ వద్ద డబ్బులు లేవని వేడుకున్నా వినలేదు. దీంతో రూ.5వేలు ఇస్తానని చెప్పి గత నెల 28న ఏసీబీ కార్యాలయంలో సంప్రదించాడు. దీంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి డీటీ కిరణ్‌కుమార్‌పై ఈనెల 1 నుంచి 4 వరకు నిఘా పెట్టారు. శుక్రవారం ఆఫీస్‌లో మధువంశీకృష్ణ నుంచి డీటీ రూ.5వేల నగదు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం రికార్డులు సోదా చేశారు. డీటీని అరెస్ట్ చేసి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్డులో హాజరుపరచనున్నారు. ఏసీబీ సీఐలు సతీష్‌కుమార్, క్రాంతికుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
డీటీపై అవినీతి ఆరోపణలు
చిట్యాల తహసీల్దార్ కార్యాలయంలో 2014లో డిప్యూటీ తహసీల్దార్‌గా కిరణ్‌కుమార్ విధుల్లో చేరాడు. రెండేళ్లుగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. జిల్లా అధికారులు పలుమార్లు హెచ్చరించారు. 2016లో తహసీల్దార్ శ్రీనివాస్ ఆత్మహత్యకు పాల్పడగా సహచర ఉద్యోగులు, అధికారులు చందాలుగా ఇచ్చిన రూ.3లక్షల డబ్బులను డీటీ దగ్గర పెట్టుకోవడంతో స్థానిక అధికారులు గొడవ పడి మృతుడి కుటుంబ సభ్యులకు ఇప్పించారు. డీలర్లు కొందరు తమను వేధిస్తున్నాడని డీటీపై ఫిర్యాదు చేశారు. ఇటీవల మంగపేట తహసీల్దార్‌గా వెళ్లాలని జిల్లా అధికారులు ఆదేశించినా పోలేదని స్థానిక అధికారులు తెలిపారు.
ఇప్పటివరకు నలుగురు
చిట్యాల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు తరుచూ జరుగుతూనే ఉన్నాయి. అధికారులు ఇష్టారాజ్యాంగా అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ ఏసీబీ అధికారులకు చిక్కడ పరిపాటిగా మారింది. 2013లో అప్పటి తహసీల్దార్ లింగాల సూరి బాబు రైతు వద్ద రూ.30 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. 2016 సెప్టెంబర్ 19న తహసీల్దార్ పాల్‌సింగ్, వీఆర్వో రవీందర్ రైతు వద్ద రూ.10 వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. డీటీగా కిరణ్‌కుమార్ శుక్రవారం రూ.5వేల లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కడం చర్చనీయాంశంగా మారింది. అయినా సహచర అధికారుల్లో మార్పు రాకపోవడంపై ప్రజలు ఆగ్రహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment