
సాక్షి, కొచ్చి : ప్రముఖ మలయాళ నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో నిందితుడైన నటుడు దిలీప్ జైలు నుంచి విడుదలవుతారని తెలియగానే ఆయన అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. తమ అభిమాన హీరో, సూపర్ స్టార్ దిలీప్ విడుదల కోసం అలువా జైలుకు ఆయన మద్ధతుదారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మరోవైపు దాదాపు మూడు నెలల పోరాటం తర్వాత ఎట్టకేలకు మంగళవారం దిలీప్‌నకు కేరళ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. నటి కేసు విషయంలో 85 రోజుల తర్వాత జైలు నుంచి దిలీప్ విడుదల కానున్నారు.
గత జూలైలో దిలీప్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అలువా జైలుకు తరలించి విచారణ చేపట్టారు. గతంలో రెండు పర్యాయాలు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటీషన్లను కోర్టులు తిరస్కరించాయి. జూలై 24న తొలిసారి, ఆగస్టు 10న మరోసారి దిలీప్‌నకు బెయిల్ విషయంలో చుక్కెదురైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు పల్సర్ సునీని నటుడు దిలీప్ పురమాయించాడని పోలీసులు భావించారు. తమవద్ద ఈ కేసులో తగిన ఆధారాలున్నాయని, ఆయనకు బెయిల్ మంజూరు చేస్తే కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశముందని ప్రాసిక్యూషన్ వాదనతో న్యాయస్థానం ఏకీభవించి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.
తాజాగా బెయిల్ కోసం దిలీప్ చేసుకున్న అభ్యర్థనను కోర్టు అంగీకరించింది. తమ హీరో దిలీప్ జైలు నుంచి విడుదలకానున్నాడని తెలుసుకున్న ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు. దిలీప్ విడుదల కోసం ఆయన ఉన్న అలువా జైలు వద్దకు భారీ సంఖ్యలో సూపర్ స్టార్ అభిమానులు తరలివస్తున్నారు. కొందరు హీరో కటౌట్లను జైలు వద్దకు తీసుకొచ్చి హడావుడి చేస్తున్నారు.