మటన్ దుకాణం వద్ద కొనుగోలుదారుల రద్దీ
సంక్రాంతి సందడంతా వారిదే. నగరం దాదాఫు ఖాళీ అయినా.. షాపులు, హోటళ్లు, వ్యాపార సంస్థలు మూతపడినా.. షాపింగ్ మాల్స్ వెలవెలబోయినా ఆ రెండు చోట్ల మాత్రం రద్దీ తీవ్రంగా కనిపించింది. అవే మద్యం, మాంసం షాపులు. సంక్రాంతి మరుసటి రోజు వచ్చే కనుమ..ప్రధానంగా పశువుల పండుగ. సంక్రాంతిరోజు పెద్దలకు పూజ చేసేవారు కనుమరోజు మందు, ముక్కతో మజా చేసుకోవడం ఆనవాయితీ. అదే ఆనవాయితీ కొనసాగడంతో ఒక్క బుధవారంనాడే కోట్ల రూపాయల్లో మద్యం, మాంసం అమ్మకాలు జరిగాయి. నగరంతోపాటు జిల్లాలో 397 మద్యం దుకాణాలు, 124 బార్లు ఉన్నాయి. వీటికి తోడు ఊరూరా ఉన్న బెల్టు షాపుల ద్వారా ఈ ఒక్క రోజు సుమారు రూ.15 కోట్ల విక్రయాలు జరిగినట్లు అంచనా.
సాధారణ అమ్మకాల కంటే ఇది రెట్టింపని మద్యం వ్యాపారవర్గాల సమాచారం. అలాగే మటన్, చికెన్ షాపులు కిటకిటలాడాయి. వీటికి తోడు రొయ్యలు, చేపల విక్రయాలు జోరుగా సాగాయి. ఇవన్నీ కలిపి రూ.10 కోట్ల విలువైన మాంసాహారాన్ని జనాలు లాగించేశారు. నగరంలోని హనుమంతవాక కబేళా నుంచి 12వేలకుపైగా మేకలు, గొర్రెలు అమ్ముడుపోయాయి. ఇక మార్కెట్లలో వేలాది నాటుకోళ్లు అమ్ముడుపోగా.. వెంకాబ్, సుగుణ, బ్యాగ్ తదితర సంస్థల షాఫుల్లో 35వేల కిలోలకుపైగా చికెన్ విక్రయాలు జరిగాయి. మాంసాహారానికి పెరిగిన డిమాండ్‌ను సొమ్ము చేసుకునేం దుకు విక్రేతలు రేట్లు విపరీతంగా పెంచేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సాక్షి, విశాఖపట్నం: కనుమ పండగ సందర్భంగా చికెన్, మటన్ దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. బుధవారం తెల్లవారగానే మాంసాహారులు దుకాణాల ముందు క్యూ కట్టారు. కిలోల కొద్దీ చికెన్, మటన్ కొనుగోలు చేశారు. నగరవాసులు గ్రామాలకు తరలిపోవడంతో మద్యం, మాంసం విక్రయాలు నగరం కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే జోరుగా సాగాయి. మంగళ, బుధవారాల్లో ఏకంగా రూ. 15 కోట్ల విలువైన మద్యం, రూ.12 కోట్ల విలువైన చికెన్, మటన్ అమ్మకాలు జరిగాయి.
♦ విశాఖ నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా 397 మద్యం దుకాణాలు, 124 బార్లు ఉన్నాయి. వీటిలో 67 మద్యం దుకాణాలు, 87 బార్‌లు నగరంలో ఉండగా, మిగిలినవి గ్రామీణ ప్రాంతంలో ఉన్నాయి. వీటన్నింటికి జిల్లాలో రెండు ఐఎంఎల్ డిపోల ద్వారా మద్యం సరఫరా జరుగుతుంది. జిల్లాలో ప్రతిరోజు సగటున రూ.7.5 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరుగుతుంటాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో మద్యం వ్యాపారులు కొద్దిరోజులుగా అధికమొత్తంలో సరుకును డిపోల నుంచి విడిపించుకొని తమ గొడౌన్లలో నిల్వ చేసుకున్నారు. నగర వాసులంతా సంక్రాంతి పండుగకు స్వస్థలాలకు వెళ్లిపోవడంతో నగరంలో మద్యం విక్రయాలు సాధారణం కంటే కొంత మేర మాత్రమే పెరిగాయి. రూరల్ జిల్లాలో మాత్రం భారీగా పెరిగాయి. డిపో ద్వారా సరఫరా జరిగిన సరుకుని పరిశీలిస్తే ఈ విషయం తేట తెల్లమవుతోంది. పండుగను దృష్టిలో పెట్టుకుని గ్రామాల్లో బెల్టుషాపులు సైతం కొత్తగా వెలిశాయి. మద్యం దుకాణాల నిర్వాహుకులే స్వయంగా బెల్టుషాపులకు మద్యం సరఫరా చేసే విక్రయాలు పెరిగేలా చూసుకున్నారు. జనవరిలో విడిచించిన సరుకులో సగానికి పైగా మంగళ, బుధవారాల్లోనే అమ్మకాలు సాగించినట్టుగా ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు.
చికెన్, మటన్ అమ్మకాలకు ఊపు
కనుమ రోజు బుధవారం కావడంతో మాంసం విక్రయాలు ఊహించని రీతిలో జరిగాయి. ఏకంగా రూ.10 కోట్ల విలువైన మటన్, చికెన్, చేపలను లాంగించేశారు. హనుమంతవాక కూడలిలోని మేకల సంతలో బుధవారం 12వేలకు పైగా మేకలు, గొర్రెలు అమ్ముడైపోయాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో నాటుకోళ్ల బజార్లలో మూడు వేలకుపైగా నాటుకోళ్లు అమ్ముడైనట్టుగా చెబుతున్నారు. ఇవేకాకుండా 35 వేల కిలోల చికెన్ అమ్ముడైందంటున్నారు. ఒక్కోమేక సగటున 10 కిలోలు వేసుకుంటే 12వేల మేకలు,గొర్రెలు కలిపి దాదాపు లక్ష కిలోల మటన్ బుధవారం అమ్ముడైనట్టుగా చెబుతున్నారు. అలాగే కేజిన్నర బరువుండే నాటుకోడి గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.900 నుంచి రూ.1200ల వరకు అమ్ముడైనట్టుగా చెబుతున్నారు. చికెన్ ధరలకు పొంతన లేకుండా ఉంది. కొన్ని చోట్ల కిలో రూ.160లనుంచి రూ.170లకు అమ్మితే మరికొన్ని చోట్ల డిమాండ్‌ను క్యాష్ చేసుకు నేందుకు ఏకంగా రూ.200లకు కూడా విక్రయాలు సాగించారు. ఇలా కోడి, మేక మాంసం అమ్మకాలు ఒక ఎత్తుయితే చేపలు, రొయ్యలు ఇతర సముద్ర మత్స్యఉత్పత్తుల అమ్మకాలు కూడా జోరుగానే సాగాయి.
Comments
Please login to add a commentAdd a comment