
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు ప్రజలకు సంక్రాంతి కానుకగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును కేంద్ర ప్రభుత్వం అందించనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 8వ వందేభారత్ రైలును జనవరి 15న ఉదయం 10:00 గంటలకు ఢిల్లీ నుంచి వర్చువల్ వేదికగా పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి విశాఖపట్నం మధ్య సుమారు 8 గంటల్లో నడిచే ఈ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 10వ నంబర్ ప్లాట్‌ఫాం వద్ద జరుగనుంది.
ఈ కార్యక్రమానికి కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి హాజరుకానున్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రిల్లో ఆగనుంది. వాస్తవానికి వందేభారత్ రైలుకు పచ్చజెండా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు శ్రీకారం, ఇతర అభివృధ్ధి పనుల నిమిత్తం ప్రధాని ఈ నెల 19న తెలంగాణకు రావాల్సి ఉంది.
అయితే ప్రీ బడ్జెట్ భేటీల్లో భాగంగా అనేక వర్గాలతో గత కొన్ని రోజులుగా ప్రధాని స్వయంగా సంప్రదింపులు జరుపుతుండటం, త్వరలో జరగనున్న కేబినెట్ విస్తరణకు కసరత్తు నేపథ్యంలో పర్యటన వాయిదా పడినట్టు చర్చ జరుగుతోంది. పర్యటన వాయిదాపై పీఎం కార్యాలయం కిషన్‌రెడ్డి, రాష్ట్ర బీజేపీ నేతలకు బుధవారం సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment