సాక్షి, విజయవాడ : గతేడాదితో పోలిస్తే 2018లో రాష్ట్రంలో నేరాలు 3.5 శాతం తగ్గాయని ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు. 2017లో ఏపీలో మొత్తం 1.23 లక్షల కేసులు నమోదు కాగా... ఈ ఏడాది 1.11 లక్షల కేసులు నమోదైనట్లు వెల్లడించారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... 2018లో రైల్వే నేరాలను గణనీయంగా తగ్గించామన్నారు. రోడ్డు ప్రమాదాలు 9.09 శాతం తగ్గాయని తెలిపారు. హత్యలు, కిడ్నాప్ వంటి నేరాలను నియంత్రినట్లు పేర్కొన్నారు. అయితే ఈ ఏడాది ఆర్థిక నేరాలు 29.22 శాతం పెరగగా...సైబర్ నేరాలు కూడా 25.67 శాతం పెరిగినట్లు వెల్లడించారు.
323 మంది మహిళలను రక్షించాం
ఆర్థిక నేరాలు, బ్యాంక్ లావాదేవీల సమయంలో ఉపయోగించే ఓటీపీల ద్వారా 185 కోట్ల రూపాయల మేర మోసాలు జరిగినట్లు డీజీపీ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ప్రజల భాగస్వామ్యం పెరుగుతుండటం వల్లే సైబర్ నేరాలు పెరుగుతున్నాయని... ఇటువంటి నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామని వెల్లడించారు. 323 మంది మహిళలను అక్రమ రవాణా నుంచి రక్షించామన్నారు. అగ్రిగోల్డ్ కేసులో 77 కోట్ల ఆస్తులను కోర్టు అటాచ్ చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment