
సాక్షి, ఒంగోలు: ప్రకాశం జిల్లా కనిగిరిలో యువతిపై అత్యాచారయత్నం ఘటన పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. తక్షణమే ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఇటీవల మహిళలపై దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్రంలో మహిళల భద్రత, సర్కార్ తీసుకుంటున్న చర్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నష్టనివారణ చర్యలకు ఏపీ సర్కారు ఉపక్రమించింది. మరోవైపు అత్యాచారయత్నం ఘటనపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. కాగా, అత్యాచారయత్నానికి గురైన బాధితురాలిని, ఆమె కుటుంబసభ్యులను మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారితో పాటు వైఎస్‌ఆర్‌సీపీ నేతలు నేతలు బుర్రా మధుసూదన్ పరామర్శించారు. అండగా వుంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితురాలి బంధువులు డిమాండ్ చేశారు.
కనిగిరిలో స్నేహం ముసుగులో ఓ విద్యార్థినిపై యువకులు అత్యాచార యత్నం చేసిన ఘటన తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. యువతి ప్రతిఘటిస్తున్నా ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి, సోషల్ మీడియాలో పోస్టు చేశారు. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులు ముగ్గురిని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు.