ప్రమాదానికి కారణమైన సిమెంట్ బెంచీ, దివిత్‌శర్మ (ఫైల్)
హైదరాబాద్: అపార్ట్‌మెంట్ నిర్వాహకుల నిర్లక్ష్యం మరో నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. శిథిలావస్థకు చేరిన సిమెంట్ బెంచీని పట్టించుకోకపోవడంతో ఓ బాలుడి ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఫిబ్రవరిలో మోనీష్ అనే చిన్నారి ఆడుకుంటూ వెళ్లి స్తంభాన్ని పట్టుకుని విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడిన సంఘటన మరచిపోకముందే మరో చిన్నారి ఆడుకుంటుండగా సిమెంట్ బెంచీ మీద పడటంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ రెండు సంఘటనలూ రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోనే చోటుచేసుకున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన దిశాన్‌శర్మ నగరంలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ.. భార్య మౌనిక, ఇద్దరు కుమారులతో హైదర్‌గూడలోని జనప్రియ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు.
ఇద్దరు కుమారుల్లో చిన్నవాడైన దివిత్‌శర్మ(6) గురువారం సాయంత్రం తన అన్నతో కలిసి అపార్టుమెంట్ ఆవరణలోని పార్కుకు వచ్చాడు. అక్కడ స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నాడు. పార్కులో కూర్చునేందుకు పదేళ్ల క్రితం ఏర్పాటు చేసిన సిమెంట్ బల్లలు శిథిలావస్థకు చేరాయి. వాటికి అమర్చిన బోల్టులు కూడా విరిగిపోయాయి. ఇవేమీ తెలియని దివిత్‌శర్మ.. ఆడుకుంటూ వెళ్లి ఆ బల్లపై కూర్చున్నాడు. అనంతరం ఒక్కసారిగా దానిపై నుంచి లేచేసరికి ఆ బెంచీ బాలుడిపై పడింది. ఈ ఘటనలో దివిత్‌శర్మ తలకు తీవ్రంగా గాయమైంది. వెంటనే కుటుంబ సభ్యులు ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. శుక్రవారం సాయంత్రం బాలుడి అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రెండు నెలల్లో రెండు ఘటనలు..
గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లలోని క్రీడా మైదానాలు, పార్కులు చిన్నారుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా పసి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలో గత రెండు నెలల్లో పార్కుల్లో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు మృత్యువాతపడ్డారు. ఫిబ్రవరి రెండో వారంలో పీరంచెరువు పెబల్‌సిటీలో మోనీష్ అనే చిన్నారి విద్యుదాఘాతానికి గురై మృత్యువాతపడ్డాడు. ఆడుకుంటూ వెళ్లి ఫుట్‌పాత్ పక్కనున్న వీధిదీపం స్తంభాన్ని పట్టుకోగా షాక్ కొట్టి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు విద్యుత్ సరఫరా కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమని నిర్ధారించి అతడిని అరెస్టు చేశారు.
అమ్మమ్మ ఇంటికి వెళ్లాల్సి ఉండగా..
స్కూలుకి సెలవులు ఇవ్వడంతో దివిత్‌శర్మ అన్న, తల్లితో కలిసి ఉత్తరప్రదేశ్‌లోని అమ్మమ్మ ఇంటికి వెళ్లాల్సి ఉంది. ఇందుకోసం ఆదివారం ఉదయం రైలుకు టికెట్లు కూడా బుక్ చేశారు. రెండు రోజుల్లో అమ్మ మ్మ ఇంటికి వెళ్లాల్సిన తరుణంలో బాలుడు మృతిచెందడంతో ఆ ఇంట్లో విషాదం అలుముకుంది. పార్క్ నిర్వహణ కోసం నెలనెలా వేలాది రూపాయలు తీసుకుంటున్నప్పటికీ, సరైన వసతులు కల్పించకుండా నిర్వాహకులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని అపార్ట్‌మెంట్‌వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment