మాట్లాడుతున్న ఏఆర్ కానిస్టేబుల్ మోషేబాబు
గుంటూరు : ఎలాంటి శిక్షణ లేకుండా అర్హత లేని ఏడుగురు ఆర్మ్‌డ్ రిజర్వ్(ఏఆర్) కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా అడ్డదారిలో పదోన్నతి కల్పించారంటూ పలువురు ఏఆర్ కానిస్టేబుళ్లు శుక్రవారం విలేకరులకు తెలిపారు. ఏఆర్ కానిస్టేబుల్ సీహెచ్ మోషేబాబు మాట్లాడుతూ గత ఏడాది జనవరిలో తిరుపతిలోని 70 మంది పదోన్నతి కోసం శిక్షణ పూర్తి చేసుకుని రాగా వారిలో 13 మందికి పదోన్నతి జాబితా ప్రకారం హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతులు కల్పించారని చెప్పారు. అయితే ఆ సమయంలో తమకు పదోన్నతి అవసరం లేదని చెప్పి ఏడుగురు కానిస్టేబుళ్లు తాము సివిల్ విభాగానికి వెళతామని చెప్పడంతో వారిని సివిల్ విభాగానికి బదిలీ చేయడంతో వారు కొద్ది రోజులకే తిరిగి మళ్లీ ఏఆర్‌లో రిపోర్టు చేశారని తెలిపారు.
జీవో నంబరు 84 ప్రకారం పోలీస్ శాఖలోని విభాగాల్లో పనిచేస్తున్న వారికి పదోన్నతులు లేవని 2012లో ప్రభుత్వం జీవో జారీ చేసిందని స్పష్టం చేశారు. వీటన్నింటినీ పక్కన పెట్టి ఎస్పీ కార్యాలయ గుమస్తా నాగరాజు ప్రస్తుతం మోటారు వెహికల్ విభాగంలో పనిచేస్తున్న ఏడుగురు కానిస్టేబుళ్ల జాబితాను రూపొందించి ఎస్పీని సైతం మభ్యపెట్టి నిబంధనలు పక్కన పెట్టి వారికి పదోన్నతులు కల్పించారని ఆరోపిస్తున్నారు. జనరల్ సీనియార్టీలో వున్న వారిని పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించిన నాగరాజుపై రూరల్ ఎస్పీతో పాటు గుంటూరు రేంజ్ ఐజీ కేవీవీ గోపాలరావుకు ఫిబ్రవరిలో ఫిర్యాదు చేశామన్నారు. ఇదే విషయమై రాష్ట్ర డీజీపీ మాలకొండయ్యకు గురువారం ఫిర్యాదు చేశామని తెలిపారు. ఇప్పటికైనా జరిగిన పొరపాటును సరిచేసి వారి పదోన్నతులు రద్దు చేసి అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలని కోరుతున్నామని వెల్లడించారు. లేకుంటే సీనియార్టీ జాబితాలో ఉన్న కానిస్టేబుళ్లు ట్రిబ్యునల్‌ను అశ్రయించి న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధపడనున్నట్టు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment