నిందితుల వివరాలను వెల్లడిస్తున్న నగర ఇన్‌చార్జి డీఎస్పీ మరియదాసు
సాక్షి, నెల్లూరు: చెడు వ్యసనాలకు బానిసైన నలుగు యువకులు, ఓ యువతి ముఠాగా (కోత బ్యాచ్) ఏర్పడ్డారు. వీరు నెల్లూరు నగరంలో తిరుగుతూ యువతిని ఎరగా చూపి దోపిడీ చేస్తారు. ఎదురుతిరిగిన వారిపై బ్లేడ్‌తో (పేపర్ కటింగ్ కోసం వినియోగించేది) దాడి చేసి అందినకాడికి దోచుకెళ్లేవారు. ఈనెల 3వ తేదీన కొత్తహాల్ సమీంపలో గణేష్ అనే యాచకుడిపై హత్యాయత్నం చేసిన కేసులో పోలీసులు కోతబ్యాచ్‌ను చిన్నబజారు పోలీసులు అరెస్ట్ చేసి వారిని విచారించే క్రమంలో విస్తుగొలిపే అంశాలు వెలుగులోకి వచ్చాయి. సోమవారం చిన్నబజారు పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నగర ఇన్‌చార్జ్ డీఎస్పీ మరియదాసు నిందితుల వివరాలను వెల్లడించారు.
నవాబుపేటలోని కుసుమహరిజనవాడకు చెందిన బక్రీదు కన్నయ్య అలియాస్ కన్నా, జేమ్స్‌గార్డెన్‌కు చెందిన జి.నాగేంద్ర, గుంటూరు జిల్లా తెనాలి మండలం అత్తోడు గ్రామానికి చెందిన తన్నీరు ఏడుకొండలు, స్టోన్‌హౌస్‌పేటకు చెందిన తాటిపర్తి వెంకయ్య, బోడిగాడితోటకు చెందిన ఝాన్సీలు వ్యసనాలకు బానిసై ముఠాగా ఏర్పడ్డారు. నిత్యం బామ్‌ఫిక్స్, సొల్యూషన్ లాంటివి సేవిస్తూ మత్తులో రోడ్లపై తిరుగుతూ నేరాలు చేయసాగారు. ఝాన్సీ అనే యువతిని దేవాలయాల వద్దకు పంపి యువకులను ఆకర్షిస్తారు. అనంతరం వారిని ఆ యువతి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లగా వారిని వెంబడిస్తూ నలుగురు వ్యక్తులు అక్కడికి చేరుకుని యువకుల వద్ద ఉన్న నగదు, నగలు దోపిడీ చేయసాగారు. ఎదురుతిరిగిన వారిపై బ్లేడ్‌లతో దాడులకు పాల్పడసాగారు.
అనేక నేరాలకు..
కొంతకాలంగా ఈ ముఠా అనేక నేరాలకు పాల్పడింది. ఫిర్యాదు చేసేందుకు బాధితులు ముందుకు రాకపోవడంతో ఈ విషయాలు వెలుగులోకి రాలేదు. ఈక్రమంలో వీరి వ్యవహారాలను యాచకుడు గణేష్ గమనించాడు. గాంధీనగర్ సాయిబాబాగుడి వద్ద యాచకుడితో వారు గొడవపడడం చూసిన గణేష్ అదేప్రాంతంలో పూలు అమ్ముకునే శీనయ్య అనే వ్యక్తికి చెప్పాడు. ఆయన కన్నాను మందలించాడు. దీంతో గణేష్‌పై కక్ష పెంచుకున్న కన్నా ఎలాగైనా అతడిని అంతమొందించాలని నిశ్చయించుకున్నాడు. ఈనెల 3వ తేదీ రాత్రి గణేష్ గాంధీబొమ్మ సమీపంలోని రోడ్డుపై నిద్రిస్తుండగా కన్నా బ్లేడ్‌తో విచక్షణారహితంగా దాడిచేశాడు. గొంతుపై కోయడంతో గొంతు ప్రధాన నరం తెగింది. మిగిలిన వారు సైతం గణేష్‌పై దాడిచేసి అతని వద్దనున్న రూ.2 వేల నగదు అపహరించారు. స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు అక్కడి నుంచి తిరుపతి రుయా హాస్పిటల్‌కు తరలించారు.
ప్రస్తుతం గణేష్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై చిన్నబజారు ఇన్‌స్పెక్టర్ ఐ.శ్రీనివాసన్ కేసు నమోదు చేశారు. తన సిబ్బందితో కలిసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు దోచుకున్న నగదుతో గంజాయిని కొని చిన్నచిన్న పొట్లాలుగా చేసి నగరంలో విక్రయిస్తుండగా సోమవారం సౌత్ రైల్వేస్టేషన్ వద్ద చిన్నబజారు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి కొంత గంజాయి, నాలుగు పేపర్ కటింగ్ బ్లేడ్‌లను స్వాధీనం చేసుకున్నారు. విచారించే క్రమంలో వారు చేసిన నేరాలు వెలుగులోకి వచ్చాయన్నారు. వీరిపై గతంలో నవాబుపేట, చిన్నబజారు, వేదాయపాళెం పోలీస్‌స్టేషన్లలో కేసులున్నాయి. కోతబ్యాచ్‌ను అరెస్ట్ చేసేందుకు కృషిచేసిన చిన్నబజారు ఇన్‌స్పెక్టర్ ఐ.శ్రీనివాసన్, ఎస్సైలు చిన్ని బలరామయ్య, హనీఫ్ తదితరులను డీఎస్పీ అభినందించారు. నిందితులంతా 20 ఏళ్ల లోపు వారేనని వ్యసనాలకు బానిసై నేరాలకు పాల్పడుతున్నారని డీఎస్పీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment