కష్టనష్టాలకు గురై పోలీస్ స్టేషన్‌కు వస్తే.. అక్కడ కూడా దౌర్జన్యమే జరిగింది. సభ్యసమాజం తలదించుకునేలా మహిళను, ఆమె వెంట ఉన్న యువతిని ఓ పోలీసు అధికారి అందరి ముందే తీవ్రంగా కొట్టడం అధికార దుర్వినియోగానికి పరాకాష్టగామారింది. మెట్రో సిటీలోనే ఈ అకృత్యం సంభవించడం విశేషం.
సాక్షి, బెంగళూరు: ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ప్రచారానికే పరిమితమైంది. తరచూ బాధితుల పట్ల దుందుడుకుగా వ్యవహరిస్తున్న ఖాకీలు నిజ స్వరూపాన్ని బయట పెట్టుకుంటున్నారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళలను తీవ్రంగా కొట్టి బయటకు గెంటేశారు. బెంగళూరు కుమారస్వామి లేఔట్ పోలీసు స్టేషన్ల ఏఎస్‌ఐ రేణుకయ్య ఈ దురాగతానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మొత్తాన్ని పోలీసు స్టేషన్‌లోని వ్యక్తి ఒకరు తమ మొబైల్‌లో రికార్డు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై పెను దుమారం రేగడంతో రేణుకయ్యను డీసీపీ అణ్ణామలై సస్పెండ్ చేశారు.
ఏం జరిగిందంటే..
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళ 11 ఏళ్ల తన కుమార్తెను తమ్మునికే ఇచ్చి పెళ్లి చేసింది. ప్రస్తుతం ఆ యువతికి 20 ఏళ్లు వచ్చాయి. గతేడాది క్రితమే సదరు యువతి భర్తను వదిలేసి బెంగళూరుకు చేరుకుంది. కుమారస్వామి లేఔట్ పోలీసు స్టేషన్ పరిధిలోని కనకపుర రోడ్డులో ఉన్న ఒక హోటల్‌లో పని చేస్తూ జీవిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు, బంధువులు ఆమెను తీసుకెళ్లేందుకు ఈ నెల 19న నగరానికి చేరుకున్నారు. హోటల్‌లో ఉంటున్న యువతిని బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆమె రానని మొండికేసి హోటల్ మేనేజర్‌కు విషయం తెలియజేసింది. మేనేజర్ ఈ వివాదాన్ని కుమారస్వామి లేఔట్ పీఎస్‌లో తెలిపాడు.
పోలీస్‌స్టేషన్‌లో విచారణ
పోలీసులు హోటల్‌కు వచ్చి వారందరినీ స్టేషన్‌కుతీసుకెళ్లి విచారించారు. తాను మేజర్‌నని, ఇక్కడే పని చేసుకుంటూ జీవిస్తానని తెగేసి చెప్పింది. ఆ యువతిని తమతో పంపించాలని బంధువులు పోలీసు స్టేషన్‌లో ఒత్తిడి చేశారు. ఈ సమయంలో పోలీసులు, బంధువుల్లోని ఒక మహిళకు మధ్య వాగ్వాదం తలెత్తింది. అమ్మాయిని తమతో పంపకుంటే ఇక్కడే పురుగుల మందు తాగి చనిపోతానని బెదిరించింది.ఈ సమయంలో స్టేషన్‌కు వచ్చిన ఏఎస్‌ఐ రేణుకయ్య గొడవ పడుతున్న మహిళను బండబూతులు తిడుతూ కొట్టుకుంటూ తలుపు వరకూ వచ్చాడు. మెడ పట్టుకుని బయటకు తోసేశాడు. ఆమె వెంట ఉన్న అమ్మాయిని కూడా బయటే కొట్టాడు. ఇదంతా పోలీసుల్లోనే ఒకరు సెల్‌ఫోన్లో వీడియో తీశారు. అది వైరల్‌కావడంతో ఏఎస్‌ఐ దాష్టీకంపై జనం మండిపడ్డారు.
కొట్టడం తప్పే: డీసీపీ అణ్ణామలై
పోలీసు స్టేషన్‌లో మహిళపై దాడి చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పేనని బెంగళూరు దక్షిణ విభాగం డీసీపీ అణ్ణామలై తెలిపారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకుని దర్యాప్తునకు ఆదేశించినట్లు చెప్పారు. రేణుకయ్యను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. దీనిపై రాష్ట్ర మహిళ కమిషన్ కూడా సీరియస్‌గా తీసుకుంది. కమిషన్ అధ్యక్షురాలు నాగలక్ష్మి బాయి పోలీసు స్టేషన్‌కు వచ్చి వివరాలు తెలుసుకున్నారు. మహిళపై ఒక ఏఎస్‌ఐ ఇలా అనుచితంగా ప్రవర్తించడం చాలా తప్పు అని ఆమె విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment