దాడి జరిగిన లిస్బన్ క్లబ్
హైదరాబాద్: ఆమె పొట్టకూటి కోసం నగరానికి వచ్చింది. ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులను పోషించుకునేందుకు ఓ బార్‌లో డ్యాన్సర్‌గా చేరింది. తోటి డ్యాన్సర్లు, నిర్వాహకులు అసాంఘిక కార్యకలాపాలు, వ్యభిచారం చేయాలని ఆమెపై తీవ్ర ఒత్తిడి చేశారు. దానికి ఒప్పుకోకపోవడంతో ఆ యువతి ఒంటిపైనున్న బట్టలూడదీసి విచక్షణారహితంగా దాడి చేశారు. బీర్ సీసాలను పగలగొట్టి చేయి, ఛాతీపై తీవ్ర గాయాలు చేశారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాలు... గుంటూరు జిల్లా సంగడికుంట కాలనీకి చెందిన జి.హరిణి(26) బతుకుదెరువు కోసం కుటుంబంతో కలసి నగరానికి వచ్చింది. యూసుఫ్‌గూడలోని కృష్ణానగర్‌లో ఉంటూ మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసేందుకు యత్నించింది. సరైన అవకాశాలు రాకపోవడంతో ఐదునెలల క్రితం బేగంపేటలోని లిస్బన్ క్లబ్‌లో డ్యాన్సర్‌గా చేరింది.
మొదట్లో బాగానే సాగినప్పటికీ కొద్దిరోజుల నుండి తోటి డ్యాన్సర్లు, ఓ మధ్యవర్తి వ్యభిచారం చేయాలని ఆమెపై ఒత్తిడి చేయసాగారు. తాను అసాంఘిక కార్యకలాపాలు చేయనని, పొట్టకూటి కోసమే డ్యాన్సర్‌గా చేస్తున్నానని హరిణి స్పష్టం చేసింది. దీంతో ఆమెపై వారు కోపం పెంచుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి 1 గంటకు పబ్ మూసేయగానే మధ్యవర్తి సయ్యద్ మాజీద్ హుస్సేన్ అలియాస్ సయీద్(30), తోటి డ్యాన్సర్లు ఎర్రబెల్లి సంధ్య అలియాస్ రితిక(24), జెక్క శ్రావణి అలియాస్ స్వీటీ(20), ఎస్.రేఖ అలియాస్ మధు(25), కొడాలి విజయారెడ్డి అలియాస్ విజ్జు(24)లు ఓ కస్టమర్ వద్దకు వెళ్లాలని ఆమెపై తీవ్రంగా ఒత్తిడి చేశారు. దీనికి హరిణి ఒప్పుకోకపోవడంతో ఒంటిపై బట్టలు ఊడదీసి విచక్షణారహితంగా దాడి చేశారు. బీర్ సీసాలను పగలగొట్టి చేయి, ఛాతీపై తీవ్ర గాయాలు చేశారు. ఆ యువతి అరుస్తూ వారి నుండి తప్పించుకుని బయటకు వచ్చి ‘100’కు ఫోన్ చేసింది. దీంతో వారు మరింత రెచ్చిపోయి పోలీసులకు ఫోన్ చేస్తావా.. అంటూ ఆమె సెల్‌ఫోన్‌ను గుంజుకొని పగలగొట్టారు.
పట్టించుకోని పోలీసులు
సమాచారం తెలుసుకున్న పంజగుట్ట ఎస్సై, సిబ్బంది అక్కడకు చేరుకుని తనను కాపాడకపోగా, దాడి చేసినవారికి వత్తాసు పలికారని బాధితురాలు ఆరోపించింది. ‘‘అమ్మాయిని కాపాడండి.. స్టేషన్‌కు తీసుకువెళ్లండి..’అని పబ్‌లోని కస్టమర్లు అన్నప్పటికీ పట్టించుకోకుండా, స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చెయ్యి, అప్పుడు చూద్దాం’అన్నారని బాధితురాలు వాపోయింది. పోలీసుల ముందే నిందితులు తనను పచ్చిబూతులు తిట్టారని, కొట్టడానికి వచ్చారని ఆవేదన వ్యక్తం చేసింది. 10 రోజులక్రితం ఇదే తరహా ఫిర్యాదు చేసేందుకు పోలీసుస్టేషన్‌కు వెళ్లగా పోలీసులు పట్టించుకోలేదని, పైగా చాలా చులకనగా మాట్లాడారని బాధితురాలు తెలిపింది. పొట్టకూటి కోసం నగరానికి వచ్చామని, తన తండ్రికి కళ్లు కనిపించవని, తల్లి పొలం పనులకు వెళుతోందని రోదిస్తూ తెలిపింది. పబ్‌లో కూడా వేతనం ఉండదని, డ్యాన్స్ చేస్తుండగా కస్టమర్లు ఇచ్చే డబ్బులతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నానని తెలిపింది.
ఆమె ఆరోపణలు నిజమైతే చర్యలు తీసుకుంటాం: ఏసీపీ
బాధితురాలు చేసిన ఆరోపణలు నిజమైతే సదరు సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పంజగుట్ట ఏసీపీ తిరుపతన్న తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని నలుగురు మహిళలను అరెస్టు చేసి వారిపై కేసు నమోదు చేశామన్నారు. ప్రధాన నిందితుడు సయీద్ తప్పించుకున్నాడని, అతన్ని కూడా త్వరలోనే పట్టుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment