ప్రమాద స్థలంలో కాంతమ్మ మృతదేహం, పక్కన దెబ్బతిన్న ఆటో
సీతానగరం: సీతానగరం ఓవర్ బ్రిడ్జి వద్ద ఆటోను వెనుక నుంచి వచ్చిన లారీ ఆదివారం ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు. నలుగురికి తీవ్ర గాయాలు కాగా, ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే...లక్ష్మీపురం గ్రామానికి చెందిన నరం కాంతమ్మ(50) మసాల సామాన్లు విక్రయిస్తుంటుంది. ఆదివారం జోగింపేటలో సరుకును విక్రయించి పార్వతీపురం నుంచి బొబ్బిలి వైపు వెళ్తున్న ఆటోలో ఎక్కి సీతానగరం వద్ద బ్రిడ్జి వద్ద ఆపాలని కాంతమ్మ చెప్పింది. రాష్ట్రీయ రహదారిపై ఉన్న ఆర్వోబీ దగ్గర ఆటో దిగి కాలనీలో ఉన్న కుమారుడు జాన్ ఇంటికి వెళ్లేందుకు సిద్ధపడుతుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఆగి ఉన్న ఆటోను ఢీకొట్టింది.
దీంతో కాంతమ్మ తలపై నుంచి రెండు టైర్లు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. నలుగురికి బలమైన గాయాలయ్యాయి. తీవ్రంగా గాయాల పాలైన వారిలో అప్పయ్యపేటలో ఆటో ఎక్కిన ఎం.లక్ష్మి, కె.సునీత, బి.భాగ్యలక్ష్మి, బి.సావిత్రమ్మ ఉన్నారు. వీరితో పాటు మింది జగన్నాధం, ఈర్ల వినయ్‌కుమార్, ఆటో డ్రైవరు నాగభూషణరావులకు స్వల్ప గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ డి.సాయిక్రిష్ణ గాయపడ్డ వారిని స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చెప్పారు. మృతురాలు కాంతమ్మకు కుమారుడు, కుమార్తె ఉన్నారు.
కారు ఢీకొని...
రామభద్రపురం: మండలంలోని కొండపాలవలస వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కోటశిర్లాం గ్రామానికి చెందిన మిత్తిరెడ్డి లక్ష్మణ(35) విశాఖపట్నం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు...లక్ష్మణ మోటారుసైకిల్‌తో రామభద్రపురం నుంచి బాడంగి ఆసుపత్రికి వెళ్తుండగా శ్రీకాకుళం నుంచి ఎదురుగా వస్తున్న కారు కొండపాలవలస వద్ద ఢీకొట్టింది. దీంతో తలకు తీవ్రమైన గాయమైంది. చికిత్స నిమిత్తం బాడంగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం విజయనగరం తరలించారు. అక్కడ నుంచి విశాఖపట్నం తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్‌ఐ డిడి.నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మణ తాపీ పని చేస్తూ జీవిస్తూ ఇలా ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఎలా బతికేదంటూ బోరుమన్నారు. లక్ష్మణకు భార్య రమణమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
సాయం చేసేందుకు వెళ్లి...తిరిగొచ్చే క్రమంలో...
లక్ష్మణ రామభద్రపురం మండల కేంద్రంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రౌతు బోగేశ్వరరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాడంగి సీహెచ్‌సీకి ఆటోలో తరలించాడు. ఈ క్రమంలో లక్ష్మణ ద్విచక్ర వాహనం రామభద్రపురంలో ఉండిపోయింది. దీన్ని తీసుకువెళ్లేందుకు రామభద్రపురం వచ్చి తిరిగి బోగేశ్వరరావు మృతదేహం వద్దకు వెళ్తుండగా ఇలా మృత్యువాత పడ్డాడు. దీంతో కోటశిర్లాంలో విషాదం అలముకొంది.
రోడ్డు ప్రమాదంలో...
నెల్లిమర్ల రూరల్: మండలంలో చిన రాడపేట జంక్షన్ వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానికులు, పోలీసులు అందించిన వివరాలు...విజయనగరంలో పూల్‌బాగ్ కాలనీకి చెందిన దాసు సూర్యనారాయణ(44) చినబూరాడపేట గ్రామంలో నివాసముంటున్న తన కుమార్తెను చూసేందుకు వచ్చాడు. తిరుగు ప్రయాణంలో బూరాడపేట జంక్షన్ వద్ద ఆటో వెనుక భాగంలో ఎక్కుతుండగా అదుపుతప్పి వెనక్కి పడిపోయాడు. తలకు తీవ్ర గాయం కావడంతో అపస్మారక స్థితిలో ఉన్న ఆయన్ను స్థానికులు విజయనగరం కేంద్ర ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ తరలించారు. కేజీహెచ్‌కు తరలిస్తుండగానే మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతునికి భార్యతో పాటు కుమార్తె, కుమారుడు ఉన్నారు. నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment